బ్రేక్ లేక.. డైపర్స్ వాడుతున్నారు!
వాషింగ్టన్: అమెరికాలోని చికెన్ ప్రాసెసింగ్ పరిశ్రమల్లో పనిచేసే కార్మికులు వెల్లడించిన విషయాలు నివ్వెరపరిచేలా ఉన్నాయి. చౌక ధరకే చికెన్ను ప్రపంచ వ్యాప్తంగా ఎగుమతులు చేస్తూ.. కోట్లు గడిస్తున్న బడా చికెన్ ఫ్యాక్టరీలు తమ కార్మికుల విషయంలో మాత్రం కనీస మానవత్వాన్ని కూడా ప్రదర్శించడం లేదు. కార్మికులు టాయ్లెట్కు వెళ్లడానికి కూడా యాజమాన్యాలు అనుమతించకుండా వేధిస్తున్నాయంటూ కొందరు కార్మికులు వెల్లడించిన నిజాలు ఇప్పుడు అంతర్జాతీయ సమాజాన్ని నివ్వెరపరుస్తున్నాయి.
పని మధ్యలో కార్మికులు టాయ్లెట్ కోసం విరామం తీసుకోవడం మూలంగా ఉత్పదకత తగ్గిపోతుందని భావించే యాజమాన్యాలు అందుకు అనుమతించడం లేదని, దీనివల్ల డైపర్స్ వాడుతున్నానంటూ ఓ కార్మికుడు వెల్లడించిన విషయాన్ని అంతర్జాతీయంగా పేదరికానికి వ్యతిరేకంగా పోరాడే ఆక్స్ఫామ్ సంస్థ తన తాజా నివేదికలో వెల్లడించింది. తానే కాదు తనతో పాటు పనిచేసే చాలా మంది కార్మికులు ఇలాగే డైపర్స్ వాడుతారని, మరికొందరు టాయ్లెట్కు వెళ్లే అవసరం లేకుండా నీటిని త్రాగకుండా పనిచేసి అనారోగ్యం పాలౌతున్నారని ఓ కార్మికుడు వెల్లడించిన విస్తుగొలిపే విషయాలను ఆ నివేదిక పేర్కొంది.
చికెన్ ప్రాసెసింగ్ పరిశ్రమల్లో పనిచేసే వందలాది కార్మికుల భయంకర అనుభవాలను ఈ నివేదిక తెలిపింది. ఇటీవల చికెన్ ప్రాసెసింగ్ పరిశ్రమలో పెరిగిన టెక్నాలజీ మూలంగా ఉత్పాదన వేగం కూడా పెరిగింది. అయితే ఈ వేగాన్ని అందుకోవడానికి బడా కంపెనీలు కార్మికులపై తీవ్రస్థాయిలో పనిభారం మోపుతున్నారని ఆక్స్ఫామ్ వెల్లడించింది. ఎనిమిది గంటల షిఫ్టుల్లో పనిచేస్తున్న కార్మికులకు రెండు విడతలు అరగంట చొప్పున విరామం ఇవ్వాలన్న కనీస నిబంధనలను చికెన్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీలు పట్టించుకోవడం లేదని నివేదిక ఆగ్రహం వ్యక్తం చేసింది.