చిలీ: దావానలం చిలీని తగులబెడుతోంది. మధ్య చిలీ ప్రాంతాలు మొత్తం ఇప్పటికే సర్వనాశనం అవుతుండటంతోపాటు దానికి సమీపంగా ఉన్న ప్రాంతాలవారు భయంతో బెంబేలెత్తిపోతున్నారు. అనూహ్యంగా రేగిన కార్చిచ్చు ఎంతకీ అదుపులోకి రాకపోగా విసురుగా వీస్తున్న పెనుగాలులు తోడవడంతో మరింత విధ్వంసం జరుగుతోంది. ఆధునిక చరిత్రలో ఇదే అతి పెద్ద కార్చిచ్చుగా అధికారులు అభివర్ణిస్తున్నారు. ఇప్పటికే మధ్య చిలీలోని ప్రజలంతా ఆ ప్రాంతాలను విడిచి దూరంగా కదిలారు.
కట్టుబట్టలు తప్ప వారి వద్ద ఏం లేకుండా పోయాయి. పలు ఇళ్ల నేలమట్టాయి. విపరీతంగా వస్తున్న వేడగాలులు, చుట్టేసిన నల్లటి పొగ కారణంతో తమ ప్రాంతానికి సమీపంలో కూడా ఉండలేని పరిస్థితి ఏర్పడింది. దీంతో ప్రస్తుతం రష్యా కూడా రంగంలోకి దిగింది. టన్నుల నీటిని నిల్వచేసుకునే సామర్థ్యంగల సూపర్ ట్యాంకర్ విమానాన్ని పంపించింది. ఇప్పటికే ఆ ప్రాంతంలో కరువు పరిస్థితులు ఉన్న నేపథ్యంలో తాజాగా సంభవించిన కార్చిచ్చు కారణంగా మరింత సంక్షోభంలోకి వెళ్లినట్లయింది.