బీజింగ్ : కరోనా వైరస్ మహమ్మారికి విరుగుడు కనుక్కునేందుకు ప్రపంచం విశ్వప్రయత్నాలు చేస్తోంది. చైనా, అమెరికా, యూరప్ దేశాలతో పాటు భారత్ కూడా వ్యాక్సిన్ తయారు చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఆయా దేశాలకు చెందిన వందలాది మంది శాస్త్రవేత్తలు కరోనా మూలాన్ని కనుక్కొనేందుకు సిద్ధమవుతున్నారు. చైనా ఇప్పటికే ఈ విషయంలో క్లినికల్ ట్రయల్స్ వరకు వెళ్లింది. వ్యాక్సిన్ తయారీకి చైనా దేశానికి చెందిన వెయ్యి మందికి పైగా శాస్త్రవేత్తలు అనుక్షణం శ్రమిస్తున్నారు. వ్యాక్సిన్ల తయారీలో నైపుణ్యం కలిగిన మిలటరీ మెడికల్ సైన్సెస్‌లో కరోనా విరుగుడుకు వ్యాక్సిన్ తయారు చేసినట్లు తెలుస్తోంది.
(చదవండి : కోవిడ్‌కు దక్షిణ కొరియా కళ్లెం ఇలా..)
ఈ నెల 16న మొదటి ట్రయల్ జరిగిందని అధికారులు తెలిపారు. ఇందులో భాగంగా 18-60 ఏళ్ల వయస్సున్న 108 మందిని మూడు బృందాలుగా విభజించి భిన్నమైన డోసులు ఇచ్చారు. వీరంతా వూహాన్ నగరానికి చెందినవారే. వీరిలో కొంతమందికి జ్వరం లక్షణాలు ఉన్నప్పటికీ వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని అధికారులు తెలిపారు. కాగా, అమెరికా కూడా వైరస్‌ను నియంత్రించే వ్యాక్సిన్ తయారుచేసే పనిలో పడింది. ఈ దేశానికి చెందిన పలు కంపెనీలు వ్యాక్సిన్ తయారీలో ముందంజలో ఉన్నాయి.
భారత్‌లో కూడా
భారతదేశంలోనూ కోవిడ్ నడ్డి విరిచే వ్యాక్సిన్ తయారీ ముమ్మరమైంది. ఇందుకు ఈ రంగంలో అనుభవమున్న ముంబైకి చెందిన సిప్లా కంపెనీ రంగంలోకి దిగింది. త్వరలోనే ట్రయల్స్ ప్రారంభించేందుకు సన్నద్ధమవుతోంది. గతంలో పలు వైరస్‌లను నియంత్రించిన వ్యాక్సిన్‌లు కోవిడ్‌ను కూడా నియంత్రించగలవా అనే దిశలో ప్రయోగాలు జరుగుతున్నాయి.
కాగా, కరోనా మహమ్మారి బారిన పడి ప్రపంచవ్యాప్తంగా ఇప్పటి వరకు 16 వేల మందికి పైగా మృతి చెందారు. 3.8లక్షల మందికి కరోనావైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇక భారత్‌లో 500 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా, 10 మంది మరణించారు.
Comments
Please login to add a commentAdd a comment