బీజింగ్: మహమ్మారి కరోనా పుట్టుకకు కేంద్ర స్థానంగా భావిస్తున్న చైనాలో మరోసారి వైరస్ విజృంభిస్తున్న తరుణంలో ఆ దేశ వైద్య నిపుణురాలు లీ ల్యాన్‌జువాన్ పలు కీలక విషయాలు వెల్లడించారు. మైనస్ డిగ్రీల ఉష్ణోగ్రతలో కరోనా దశాబ్దాల పాటు జీవించి ఉండగలదని పేర్కొన్నారు. మైనస్ 4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతల వద్ద కొన్ని నెలల పాటు ఉనికి చాటుకోగల మహమ్మారి.. మైనస్ 20 డిగ్రీల కంటే తక్కువ ఉష్ణోగ్రతల వద్ద 20 ఏళ్లకు పైగా బతికి ఉండే అవకాశాలు ఉన్నాయని అభిప్రాయపడ్డారు.
చైనా కోవిడ్-19 నిపుణుల బృందంలో ఒకరైన లీ స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. శీతల పరిస్థితులను తట్టుకోగల కరోనాకు ఉన్న అసాధారణ సామర్థ్యాల వల్ల అది దేశాల మధ్య సులభంగా వ్యాప్తి చెందుతోందని అభిప్రాయపడ్డారు. కరోనా వ్యాపించిన తొలినాటి నుంచి చోటుచేసుకున్న పరిణామాలను లోతుగా పరిశీలిస్తే.. అత్యంత శీతల ప్రదేశాల్లో వైరస్ ఎక్కువకాలం మనుగడ సాధించగలదనే విషయం స్పష్టమతోందన్నారు. మాంసాన్ని దీర్ఘకాలం పాటు నిల్వ చేసే సీ ఫుడ్ మార్కెట్లలో వైరస్ ఆనవాళ్లు బయటపడినందున ప్రతీ ఒక్కరు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. (ప్రపంచవ్యాప్తంగా ఒక్కరోజే 1,87,000 కొత్త కేసులు)
పచ్చి మాంసానికి దూరంగా ఉండండి
ఇక నిల్వ చేసిన ఆహార పదార్థాలు, మాంసం మార్కెట్ల నుంచి కరోనా వ్యాపిస్తుందన్న హెచ్చరికల నేపథ్యంలో కొన్నాళ్లపాటు పచ్చి మాంసం, చేపలు తినకుండా ఉంటే మంచిదని చైనా నిపుణులు సూచిస్తున్నారు. నిజానికి సీ ఫుడ్ కారణంగా కోవిడ్ సోకినందనడానికి ఎటువంటి ఆధారాలు లేకపోయినప్పటికీ ముందు జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉందని స్పష్టం చేశారు. ఈ క్రమంలో చైనా సీడీసీ పరిశోధకులు ఫెంగ్ జావోలూ మాట్లాడుతూ.. ‘‘కాచి చల్లార్చిన నీళ్లు తాగాలి. వేడి వేడి ఆహార పదార్థాలు తినాలి. అదే విధంగా పండ్ల తొక్కలు తీయకుండానే తినేయాలి. తరచుగా ఉపయోగించే టేబుల్‌వేర్‌ను డిస్ఇన్‌ఫెక్ట్ చేయాలిమాంసం వండుకున్నపుడు.. దానిని కట్ చేసుకునే క్రమంలో ఉపయోగించిన చాపింగ్ బోర్డును ముట్టుకోవడానికి ముందు, ఆ తర్వాత చేతులు శుభ్రంగా కడుక్కోవాలి ’’అని సూచించారు. ('కరోనా నివారణకు ప్రత్యేక వ్యాక్సిన్‌ను కనుగొన్నాం')
యూరప్ నుంచి వైరస్..
కరోనా తాజా విజృంభణ నేపథ్యంలో డ్రాగన్ ప్రభుత్వం ఆదివారం కరోనా జెనోమ్ డేటా(జన్యు సమాచారం)ను విడుదల చేసింది. ప్రస్తుతం చైనాలో విస్తరిస్తున్న వైరస్ యూరప్ నుంచి వ్యాప్తి చెందుతోందని వెల్లడించింది. ఇదిలా ఉండగా.. ఆదివారం చైనాలో కొత్తగా 18 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆరోగ్య శాఖ సోమవారం వెల్లడించింది. ఇక రాజధాని బీజింగ్‌లో కొత్తగా తొమ్మిది మందికి కరోనా సోకినట్లు తెలిపింది. దీంతో ఇతర ప్రాంతాలకు కరోనా విస్తరించకుండా స్థానిక అధికారులు కఠిన నిబంధనలు అమలు చేస్తున్నట్లు పేర్కొంది. ఇక బీజింగ్‌లోని అతిపెద్ద హోల్‌సేల్ ఫుడ్ మార్కెట్ షిన్‌ఫాడిలో మరోసారి కరోనా ఆనవాళ్లు బయటపడిన నేపథ్యంలో అప్రమత్తమైన అధికారులు.. పట్టణవ్యాప్తంగా ఉన్న అన్ని ఫుడ్ మార్కెట్లలోని దుకాణాల యజమానులు, రెస్టారెంట్ మేనేజర్లు, ప్రభుత్వ క్యాంటీన్లలో పనిచేసే వారందరికీ కోవిడ్ పరీక్షలు నిర్వహించనున్నట్లు వెల్లడించిన సంగతి తెలిసిందే. అదే విధంగా ఫుడ్‌మార్కెట్లలో పనిచేసే వాళ్లంతా తప్పనిసరిగా ఫేస్‌మాస్కులు, గ్లోవ్స్ ధరించాలని నిబంధనలు విధించారు.(బ్రెజిల్ బేజార్)
Comments
Please login to add a commentAdd a comment