
ఒప్పంద కార్యక్రమంలో పాల్గొన్న ఇమ్రాన్ ఖాన్, కెకియాంగ్
బీజింగ్: ఆర్థిక సంక్షోభంతో కొట్టుమిట్టాడుతున్న పాకిస్తాన్‌ను అన్నిరకాలుగా ఆదుకుంటామని చైనా తెలిపింది. వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పటిష్టం చేసుకోవడంలో భాగంగా వ్యవసాయం, పరిశ్రమలు, టెక్నాలజీ సహా 16 రంగాల్లో పాక్‌తో శనివారం ఒప్పందం చేసుకుంది. చైనాలో తొలిసారి పర్యటిస్తున్న పాకిస్తాన్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్, చైనా ప్రధాని కెకియాంగ్‌తో ఈ ఒప్పందాలను కుదుర్చుకున్నారు. అనంతరం ఇమ్రాన్ మీడియాతో మాట్లాడుతూ..‘చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్(సీపీఈసీ) కారణంగా ఇరుదేశాల మధ్య సంబంధాలు మరింత దృఢమయ్యాయి. 2013లో ఇది ఒక ఆలోచన మాత్రమే. కానీ ఇప్పుడది కార్యరూపం దాల్చింది’ అని తెలిపారు. కెకియాంగ్ స్పందిస్తూ..‘చైనా, పాకిస్తాన్‌ల మధ్య అన్ని రంగాల్లో సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. పాక్‌కు ఎల్లప్పుడూ తొలి ప్రాధాన్యత ఉంటుంది. ఇందులో భాగంగానే పాక్‌లో పేదరిక నిర్మూలన కోసం ఒప్పందాలు చేసుకున్నాం’ అని వెల్లడించారు.