చైనా చారిత్రక గుడిని కదిలిస్తున్నారు
సాక్షి, బీజింగ్: మరో అరుదైన ప్రయత్నానికి చైనా వేదిక కాబోతుంది. సాధారణంగా ఒక ఇంటిని మరో స్థానంలోకి క్రేన్ ల సాయంతో తీసుకెళ్లటం లాంటివి చూస్తూ ఉంటాం. కానీ, ఓ పురాతన ఆలయాన్ని కాస్త ముందుకు కదిలించేందుకు (రీ లోకేషన్) చైనా అధికారులు ప్రయత్నాలు ప్రారంభించారు.
షాంగైలోని ప్రసిద్ధ యూఫో ఆలయాన్ని 30.66 మీటర్లు స్థాన చలనం చేసేందుకు సిద్ధం అయ్యారు. 1882 లో నిర్మితమైన ఈ బౌద్ధ ఆలయంను భద్రతా, విస్తరణ తదితర కారణాల వల్ల కదిలించాలని అధికారులు నిర్ణయించుకున్నారు. 18 మీటర్ల ఎత్తైన ఈ ఆలయాన్ని ఉత్తరం వైపుగా గుడిని కదిలించటంతోపాటు ఎత్తు పరంగా 1.06 మీటర్లు పెంచటం లాంటి మరమ్మత్తు పనులు కూడా చేయబోతున్నారంట.
ముందుగా హాల్ ను పునాది నుంచి వేరు చేసి ఓ వేదికపై తీసుకొస్తారు. ఆపై ట్రాక్ ల ద్వారా ముందుకు కదిలిస్తారు. హాల్ ఉన్న స్థానంలో మరో కట్టడం నిర్మించబోతున్నారంట. మూడు బౌధ్ద ప్రధాన విగ్రహాలకు కూడా స్థాన చలనం ఉండబోతుంది. తొలి ప్రయత్నంలో భాగంగా ఆదివారం 90 సెంటీమీటర్లు కదిలించామని, వారంలోగా పనులన్నీ పూర్తి చేస్తామని ఇంజనీర్ లు వెల్లడించారు.
షాంగై పర్యాటక ప్రాంతాల్లో ఒకటిగా విరజిల్లుతున్న ఆ ఆలయాన్ని విస్తరించటం ద్వారా ఎక్కువ మంది పర్యాటకులను ఆకర్షించేందుకు వీలుంటుందని టూరిజం శాఖ భావిస్తోంది. సాలీనా సుమారు 2 మిలియన్, పవిత్ర దినాల్లో లక్ష దాకా ప్రజలు సందర్శిస్తారని యూఫో ఆలయ నిర్వాహకులు చెబుతున్నారు.