బీజింగ్: వివాదాస్పద సరిహద్దు ప్రాంతమైన డోక్లాంలో నిర్మిస్తున్న మౌలిక వసతులను చైనా సమర్థించుకుంది. అవి చట్టబద్ధమేనని, తమ సైన్యం, అక్కడ నివసిస్తున్న ప్రజల సౌకర్యార్థమే వాటిని చేపడుతున్నట్లు స్పష్టం చేసింది. ఈ విషయంలో భారత్ వ్యాఖ్యలు చేయకూడదని కోరింది. చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి లూ కాంగ్ బీజింగ్‌లో మీడియాతో మాట్లాడుతూ డోక్లాంలోని తమ మిలటరీ కాంప్లెక్స్‌కు సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు మీడియాలో వచ్చిన సంగతి తన దృష్టికి వచ్చినట్లు అంగీకరించారు.
తమ సైనికులు, డోక్లాంలో నివసిస్తున్న ప్రజల కోసమే చైనా అక్కడ మౌలిక వసతుల కల్పనను చేపడుతోందని అన్నారు. సరిహద్దుల్లో గస్తీ చేయడానికి, సైనికులు, ప్రజల జీవన ప్రమాణాలు పెంచడానికే రోడ్డు నిర్మాణం వంటి మౌలిక వసతులను నిర్మించామని తెలిపారు. చైనా సొంత భూభాగంపైనే తన సార్వభౌమాధికారాన్ని వినియోగించుకుంటోందని అన్నారు.
ప్రతిష్టంభనతో సంబంధాలకు పరీక్ష
‘డోక్లాంలో మేము చేపడుతున్న నిర్మాణాలు సక్రమం, సమర్థనీయమే. భారత్ తన భూభాగంలో చేపడుతున్న నిర్మాణాలపై చైనా వ్యాఖ్యానించదు. అలాగే మా ప్రాంతంలోని నిర్మాణాలపై భారత్ స్పందించకూడదు. చికెన్ నెక్ కారిడార్‌లో చైనా రోడ్డు నిర్మాణ పనులను భారత్ అడ్డుకోవడం వల్ల ఇరు దేశాల సంబంధాలకు పెద్ద పరీక్ష ఎదురైంది’ అని కాంగ్ పేర్కొన్నారు.
మరోవైపు, డోక్లాంలో పరిస్థితిని నిరంతరం పరిశీలిస్తున్నామని, చైనా చేపడుతున్న నిర్మాణాలపై వెలువడిన కథనాలు అవాస్తవమని భారత విదేశాంగ శాఖ కొట్టిపారేసింది. డోక్లాంలో యథాతథ స్థితిలో ఎలాంటి మార్పు లేదని ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment