
బీజింగ్ : స్కైల్యాబ్ స్పేస్ స్టేషన్ కూలిపోవటంపై గత రెండు రోజులుగా ప్రపంచ మీడియాలో వస్తున్న కథనాలపై చైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏరో స్పేస్ రంగంలో చైనా ఎదుగుదలను భరించలేక బురద జల్లుతు.. మీడియా ఛానెళ్లు అతి ప్రదర్శించాయంటూ దుమ్మెత్తిపోసింది.
‘అదొక సాధారణ స్పేస్‌క్రాఫ్ట్. అయినా కూలిపోతే ఏదో విపత్తు సంభవిస్తుందన్న స్థాయిలో అధిక ప్రాధాన్యం ఇస్తూ అంతర్జాతీయ మీడియా ఛానెళ్లు కథనాలు ప్రచురించాయి. చైనా అంతరిక్ష రంగాన్ని దెబ్బతీసేందుకే ఇలాంటి చేష్టలకు పాల్పడ్డాయి. కొందరైతే అది ఎక్కడ కూలిపోతుందో చెబుతూ ప్రజల్లో భయాందోళనలు రేకెత్తించారు’ అంటూ చైనా అధికారిక పత్రిక గ్లోబల్ టైమ్స్ పేర్కొంది.
కాగా, దాదాపు 11 మీటర్లు ఉన్న తియాంగాంగ్-1ను చైనా 2011లో ప్రయోగించింది. కాలపరిమితి ముగియటంతో 2017లోనే ఇది కూలిపోతుందని భావించినప్పటికీ.. కాస్త ఆలస్యం అయ్యింది. చివరకు ఆదివారం అర్ధరాత్రి దాటాక భూ వాతావరణంలోకి ప్రవేశించగానే మంటలు చెలరేగి దగ్ధమైపోయినట్లు చైనా స్పేస్ విభాగం వెల్లడించింది. ఆ శకలాలు ఫసిఫిక్ మహాసముద్రం దక్షిణ ప్రాంతంలో పడిపోయినట్లు పేర్కొంది.