చైనా నిర్ణయంపై హర్షం
బీజింగ్: చైనా 2017 చివరి నాటికి ఏనుగు దంతాల వ్యాపారాన్ని పూర్తిగా నిలిపేయనుంది. అంతరించే ముప్పు ఎదుర్కొంటున్న ఆఫ్రికా ఏనుగులకు ఇది ఎంతో మేలుచేసే నిర్ణయమని పర్యావరణవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. ఏనుగు దంతాల మార్కెట్‌కు కేంద్రంగా ఎదిగిన ఆ దేశం మార్చిలో వాటి ఎగుమతులపై మూడేళ్ల నిషేధం విధించింది. అటవీ జంతువులు, మొక్కల అక్రమ వాణిజ్య కట్టడికే ఈ నిర్ణయం తీసుకుంది.‘ చైనా క్రమంగా ఏనుగు దంతాల వాణిజ్య శుద్ధి, అమ్మకాలను 2017 చివరినాటికి అపుతుంది’ అని ప్రభుత్వ మీడియా జిన్హువా వెల్లడించింది.
ఈ నిర్ణయం అమలైతే చైనాలో 34 ఏనుగు దంతా శుద్ధి కేంద్రాలు, 143 మార్కెట్లు మూతపడతాయని తెలిపింది. అయితే ఆలోపు ఇలాంటి వ్యాపారాల్లో జరుగుతున్న అక్రమాలపై చట్ట అమలు సంస్థల ఉక్కుపాదం కొనసాగుతుందని పేర్కొంది. చైనా, హాంకాంగ్ మార్కెట్ల డిమాండ్‌కు అనుగుణంగా ఏటా వందల కొలది ఆఫ్రికా ఏనుగులను వేటగాళ్లు వధిస్తున్నారు.
ఏడేళ్లలో ఏనుగుల జనాభా 30 శాతం పడిపోయింది. చైనాలో కిలో దంతాల వెల 1100 డాలర్లు పలుకుతుంది. చైనా నిర్ణయం చారిత్రక ప్రకటన అని పర్యావరణ సంస్థ డబ్ల్యూడబ్ల్యూఎఫ్ అభివర్ణించింది. ఆఫ్రికాలో ఏనుగుల అక్రమ వేటను నిలువరించడానికి ఇది దోహదపడుతుందని తెలిపింది.