రోబోను పెళ్లాడుతున్న ఇంజనీరు
బీజింగ్: చైనాలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇంజనీర్‌గా పని చేస్తున్న 31 ఏళ్ల జెంగ్ జియాజియాకు ఎవరూ పిల్లనివ్వడానికి ముందుకు రాలేదు. ఇంట్లోనేమో పెళ్లి ఇంకెప్పుడు చేసుకుంటావంటా తల్లిదండ్రులు పోరు పెరిగింది. ఎలాగైనా పెళ్లి చేసుకోవాలనుకున్న జెంగ్ ఏడాది క్రితం తాను తయారు చేసిన రోబో బొమ్మనే పెళ్లి చేసుకున్నాడు. అది కూడా చైనా సంప్రదాయం ప్రకారం పద్ధతిగా తల్లిదండ్రులను, బంధు, మిత్రులను ఆహ్వానించి అందరి సమక్షంలో చేసుకున్నాడు. ఇంజియింగ్ అని ముద్దుగా పిలుచుకునే రోబోతోని జెంగ్ రెండు నెలలపాటు డేటింగ్ కూడా చేశాడట.
వారి పెళ్లి మొన్న మార్చి 31వ తేదీన జరిగినట్లు ‘సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్’ తెలియజేసింది. రోబో బొమ్మతో జరిగిన తన పెళ్లిని రిజిస్టర్ కూడా చేయించాలనుకున్నాడు జెంగ్. పెళ్లిళ్ల రిజిస్ట్రేషన్ కార్యాలయం సిబ్బంది మాత్రం అందుకు ససేమిరా అన్నదట. కత్రిమ మేథస్సుతో పనిచేసే రోబో చైనా భాషలో మాట్లాడేందుకు కొన్ని మాటలు కూడా నేర్చుకుందట. తాను ఇంట్లో ఉన్నా, లేకపోయినా ఇంటి పనులను తనంతట తానే చక్కబెట్టుకునేందుకు వీలుగా ఇంజియింగ్‌ను అప్‌డేట్ చేయాలనుకుంటున్నట్లు జెంగ్ తెలిపారు.
చైనాలో పెళ్లికి ఆడపిల్లలు దొరకడం ఎంత కష్టమో జెంగ్, రోబోల పెళ్లి సూచిస్తోంది. దేశంలో ప్రతి 114 మంది మగవాళ్లకు వంద మంది అమ్మాయిలే ఉన్నారని గణాంకాలు తెలియజేస్తున్నాయి. మొన్నటి వరకు చైనా ఏక సంతాన విధానాన్ని అనుసరించడం వల్ల అబార్షన్లు పెరిగిపోయి అమ్మాయిల సంఖ్య తగ్గిపోయింది.