విమానంలో దాక్కొని చైనా నుంచి దుబాయ్కు..
దుబాయ్: చైనాకు చెందిన ఓ యువకుడు ఎమిరేట్స్ కార్గో విమానంలో దాక్కున్నాడు. దీంతో అతడు దాదాపు తొమ్మిదిగంటలపాటు అందులోని ఉండిపోవాల్సి వచ్చింది. ఈ సమయంలో విమానం షాంఘై నుంచి దుబాయ్కు చేరుకుంది. ఓ ఆంగ్ల పత్రిక తెలిపిన వివరాల ప్రకారం చైనాకు చెందిన స్టోవావే అనే పదహారేళ్ల బాలుడు కార్గో విమానంలో దాగి ఉన్నట్లు విమానం దుబాయ్ చేరుకున్నాక తెలిసింది. దుబాయ్లో జీవితం చాలా బాగా ఉంటుందని తాను కొంతమంది ద్వారా విన్నానని, డబ్బు సంపాదించడానికి దుబాయ్ చాలా అనుకూల నగరం అని తెలిసిందని, అందుకే తాను దుబాయ్ రావాలని నిర్ణయించుకున్నట్లు ఆ బాలుడు తెలిపాడు.
కార్గో విమానంలోని బ్యాగ్స్ సెక్షన్లో తనకు హాయిగా ఉందని అందుకే అందులోనే దాక్కున్నట్టు చెప్పాడు. ఈ బాలుడికి దుబాయ్ భాష రాకపోవడంతో చైనాకు చెందిన ఓ ట్రాన్స్ లేటర్ ద్వారా అతడు చెప్పే దానిని అర్థం చేసుకున్నారు. అతడు తెలిపిన వివరాల ప్రకారం ఆ బాలుడు వాయవ్య నైరుతి చైనాలోని బెజాంగ్ అనే ప్రాంతానికి చెందిన వాడిగా గుర్తించారు. దుబాయ్‌లో అడుక్కునే వారు సైతం కుప్పలు తెప్పలుగా డబ్బు సంపాదించవచ్చనని ఆన్ లైన్ ద్వారా తెలుసుకున్నానని చెప్పాడు. అయితే, అసలు విమానంలోకి ఎలా వచ్చాడనే విషయం మాత్రం గుర్తించలేకపోయారు. ప్రస్తుతం ఆ బాలుడు గల్ఫ్ ఎమిరేట్స్ అధికారుల అదుపులో ఉన్నాడు.