
ఆరోగ్యంగానే హిల్లరీ
వాషింగ్టన్: తన ఆరోగ్యంపై రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ చేస్తున్న ఆరోపణలను హిల్లరీ క్లింటన్ ప్రచారశిబిరం తోసిపుచ్చింది. ఈ మేరకు హిల్లరీ క్లింటన్ ప్రచార కర్త జెన్నీఫర్ పల్మీరీ బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. డొనాల్డ్ ట్రంప్ నకిలీ వైద్య నివేదికలతో హిల్లరీ ఆరోగ్యంపై దుష్ప్రచారం చేస్తున్నారని సదరు ప్రకటనలో తెలిపారు. రోజర్ స్టోన్, అతని రైట్ వింగ్ పక్షాలు అందిస్తున్న కల్పిత వైద్య నివేదికలతో డొనాల్డ్ ట్రంప్ అబద్ధాల్ని చిలక పలుకుల్లా వల్లెవేస్తున్నారంటూ మండిపడ్డారు. డొనాల్డ్ ట్రంప్ ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం హిల్లరీ క్లింటన్‌ను ఉద్దేశిస్తూ...‘అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్‌పై చర్యలు తీసుకునేందుకు హిల్లరీ శారీరకంగానూ, మానసికంగాను బలహీనురాలు’అని వ్యాఖ్యానించడం తెలిసిందే.
అయితే వీటిని ఖండిస్తూ, హిల్లరీ క్లింటన్ పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యనివేదికల్ని బుధవారం విడుదల చేశారు. వీటితోపాటు హిల్లరీ క్లింటన్ పన్నుదాఖలు పత్రాలను కూడా విడుదల చే శారు. ఆర్థిక వ్యవహారాలకు సంబంధించిన ప్రాథమిక సమాచారాన్ని కూడా ప్రజలకు అందించడంలో ట్రంప్ విఫలమయ్యారని విమర్శించారు. ఇదిలా ఉండగా..హిల్లరీ క్లింటన్ అమెరికా రక్షణా విభాగం కార్యదర్శిగా చేసిన సమయంలో ఈ–మెయిల్ కుంభకోణానికి సంబంధించిన వ్యవహారంలో ఎఫ్‌బీఐ తన విచారణ నివేదికను కాంగ్రెస్‌కు సమర్పించింది.