హాస్యనటుడు రాబిన్ విలియమ్స్ ఆత్మహత్య!
ఒబామా, కమల్‌హాసన్ తదితరుల సంతాపం
లాస్ ఏంజెలిస్: మరపురాని నటనతో కోట్లాది ప్రేక్షకులను నవ్వుల్లో ముంచెత్తిన ప్రఖ్యాత హాలీవుడ్ నటుడు, ఆస్కార్ అవార్డు విజేత రాబిన్ విలియమ్స్(63) ఇకలేరు. ఆయన సోమవారం కాలిఫోర్నియాలోని టిబురన్‌లో సొంతిట్లో ఆకస్మికంగా మృతిచెందారు. ఆయన ఆత్మహత్య చేసుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు.
విలియమ్స్ మధ్యాహ్నం అపస్మారకంలో ఉన్నారని తెలుసుకుని అత్యవసర వైద్య సిబ్బంది ఆయన ఇంటికి వెళ్లారు. ఆయనను పరీక్షించి మృతిచెందినట్లు ప్రకటించారు. విలియమ్స్ శ్వాసకు అవరోధకం కల్పించుకుని, బలవన్మరణానికి పాల్పడి ఉండొచ్చని స్థానిక పోలీసు అధికారి ఒకరు చెప్పారు. విలియమ్స్ కొన్నాళ్లుగా తీవ్ర ఆందోళనతో ఉన్నారని ఆయన ప్రచారకర్త మారా బాక్స్‌బామ్ తెలిపారు. ‘గుడ్‌విల్ హంటింగ్’, ‘డెడ్ పొయెట్స్ సొసైటీ’, ‘గుడ్‌మార్నింగ్, వియత్నాం’ తదితర చిత్రాల్లో మనసు కదిలించే నటనతో విలియమ్స్ ప్రేక్షుకుల హృదయాలను గెలుచుకున్నారు. నాలుగుసార్లు ఆస్కార్ అవార్డులకు నామినేషన్ పొందిన ఆయన ‘‘గుడ్‌విల్ హంటింగ్’ చిత్రానికిగాను ఉత్తమ సహాయ నటుడి పురస్కారాన్ని అందుకున్నారు. ఆ చిత్రంలో ఆయన తెలివైన మానసిక వైద్యుడి పాత్ర పోషించారు. భారతీయ నటుడు కమల్‌హాసన్ నటించిన ‘అవ్వై షణ్ముగి’(తెలుగులో ’భామనే సత్యభామనే’) చిత్రం.. విలియమ్స్ చిత్రం ‘మిసెస్ డౌట్‌ఫైర్’ అనుకరణ.
వెల్లువెత్తిన సంతాపం..: విలియమ్స్ మృతిపై హాలీవుడ్‌తోపాటు బాలీవుడ్ కూడా తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఆయన అభిమానులు పెను విషాదంలో మునిగిపోయారు. ‘ఆయన గొప్ప హాస్యనటుడు. మానవ హృదయంలోని ప్రతికోణాన్ని స్పృశించారు. మనల్ని నవ్వించారు, ఏడిపించారు’ అని అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా కొనియాడారు.
విలియమ్స్ మరణం గురించి బాధపడకుండా ఆయన పంచిన నవ్వులను గుర్తు చేసుకోవాలని ఆయన భార్య సుసాన్ పేర్కొన్నారు. విలియమ్స్ నాటకప్రదర్శనలు అత్యుత్తమమని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ పేర్కొన్నారు. విలియమ్స్ మగవాడి దుఃఖానికి గౌరవాన్ని సంపాదించిపెట్టారని కమల్ హాసన్ వ్యాఖ్యానించారు. షారుక్ ఖాన్, షబానా ఆజ్మీ తదితర సినీ ప్రముఖులు కూడా నివాళులర్పించారు.