ఐక్యరాజ్యసమితి: ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు అవినీతే మూల కారణమనీ, ఈ జాడ్యం కారణంగా ప్రపంచ జీడీపీలో 5 శాతానికి సమానమైన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని ఐక్యరాజ్య సమితి (ఐరాస) ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గ్యుటెరస్ అన్నారు. హింస, ఘర్షణలు, అస్థిరత, ఆయుధాలు, మాదకద్రవ్యాలు, మానవుల అక్రమ రవాణా తదితర అనేక సమస్యలు అవినీతి వల్లే రోజురోజుకూ పెరిగిపోతున్నాయని చెప్పారు. లంచగొండితనం కారణంగా హింస పెచ్చరిల్లుతుండటం, అంతర్జాతీయంగా శాంతి భద్రతలను కాపాడేందుకు అవినీతిని అంతమొందిచటం అనే అంశాలపై ఐరాస భద్రతా మండలి సోమవారం నిర్వహించిన సమావేశంలో గ్యుటెరస్ మాట్లాడారు.
ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరం) అంచనాలను ఆయన ఉటంకిస్తూ.. అవినీతి కారణంగా ప్రపంచం 2.6 ట్రిలియన్ డాలర్ల మేర మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని పేర్కొన్నారు. అక్రమ నగదు రవాణా, పన్ను ఎగవేతల కారణంగానే అవినీతి రోజురోజుకూ పెరిగిపోతోందనీ, ఈ నేరాలను అరికట్టేందుకు అన్ని దేశాలూ సమర్థవంతమైన చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయ సమాజాన్ని గ్యుటెరస్ కోరారు.
జాతీయ అవినీతి వ్యతిరేక కమిషన్లను ఏర్పాటుచేసి, విచారణ జరపడం అత్యంత ఆవశ్యకమనీ, స్వతంత్ర న్యాయవ్యవస్థ, మీడియా స్వేచ్ఛ, అవినీతిని బయటపెట్టే సామాజిక కార్యకర్తలకు రక్షణ ఉండేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని ఆయన ప్రపంచ దేశాలకు సూచించారు. ‘అవినీతి అన్ని దేశాల్లోనూ ఉంది. ధనిక–పేద, ఉత్తర–దక్షిణ, అభివృద్ధి చెందిన–అభివృద్ధి చెందుతున్న.. ఇలా ప్రపంచంలోని ప్రతీ దేశంలోనూ అవినీతి ఉంది. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం వ్యక్తులు, వాణిజ్య సంస్థలు ఏడాదికి ఒక ట్రిలియన్ డాలర్ల కన్నా ఎక్కువే లంచం ఇస్తున్నాయి’ అని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment