చైనాలోని వూహాన్ ఉద్భవించి, ప్రపంచ దేశాలను భయభ్రాంతులకు గురిచేస్తున్న కోవిడ్–19(కరోనా వైరస్) మరణాల సంఖ్య ఇప్పటికే 1,500 దాటింది. మొదట గత ఏడాది డిసెంబర్‌లో కరోనా పేరు వినిపించింది. దీని ప్రభావాన్ని తక్కువగా అంచనా వేసిన ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించడానికి సైతం వెనకాడింది. క్రమంగా కరోనా వైరస్ వల్ల ఒక్క చైనాలోనే స్వల్పకాలంలో వందలాది మంది టపటపా రాలిపోవడంతో డబ్ల్యూహెచ్‌వో అప్రమత్తమైంది. ఈ మహమ్మారిని అడ్డుకోవడం సమీప భవిష్యత్తులో సాధ్యం కాదని తేల్చి చెప్పింది. ఇప్పటికిప్పుడు కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు టీకా మందును కనుక్కోవాలన్నా కనీసం ఆ ప్రయత్నం జరగడానికే 18 నెలల సమయం పడుతుందని వైద్య శాస్త్రవేత్తలు స్పష్టం చేశారు.
ప్రపంచ ప్రజారోగ్య శత్రువుగా పరిణమిస్తున్న కోవిడ్–19 వైరస్ ఇప్పటికే 66 వేల మందికి సోకినట్టు నిర్ధారణ అయ్యింది. ఈ వైరస్ 28 దేశాలకు విస్తరించి ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. కోవిడ్ వైరస్ దేనిద్వారా విస్తరిస్తుందనే విషయంలో ఏకాభిప్రాయం లేదు.
కొన్ని దశాబ్దాల క్రితమే కరోనా వైరస్ గుర్తించారు. కరోనా వైరస్ ఒక వైరస్ కాదు. వైరస్ కుటుంబం పేరు. గతంలో వచ్చిన ఐదారు రకాల వైరస్‌లు కూడా ఇదే కోవలోకి వస్తాయి. అవన్నీ జంతువులు, పక్షులు ద్వారా వ్యాపించినవి. కోవిడ్–19 వైరస్ మనుషుల నుంచి శరవేగంగా మనుషులకు సంక్రమించే వైరస్.
ప్రపంచంలో ప్రబలు తున్న ప్రాణాంతక వ్యాధుల వల్ల మానవ సమాజం ఆర్థికంగా నష్టపోతోంది. గతంలో ‘సార్స్’ వల్ల ఉత్పత్తి క్షీణించి, 40 బిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లినట్లు అంచనా.
వైరస్ పేరు మార్పు
కరోనా వైరస్ పేరును ప్రపంచ ఆరోగ్య సంస్థ కోవిడ్–19గా (కరోనా, వైరస్ డిసీజ్) మార్చింది, కరోనా అనే పేరు ఇప్పటికే వ్యక్తులకు, ప్రాంతాలకు, సంస్థలకు ఉండటం వల్ల అది ఒక వ్యాధిని సూచించే వైరస్‌గా మాత్రమే ఉండాలని డబ్ల్యూహెచ్‌ఓ కరోనా వైరస్ పేరును కోవిడ్‌గా మారుస్తున్నట్లు ప్రకటించింది. కోవిడ్ వైరస్ బారిన పడినవారి దగ్గరికి ఎప్పుడైనా వెళ్లామా అనేది తెలుసుకోవడానికి క్లోజ్ కాంటాక్ట్ డిటెక్టర్ అనే యాప్‌ను చైనా రూపొందించింది.
‘సార్స్’తో పోలిక లేదు
కోవిడ్–19కి ‘సార్స్’ వైరస్ లక్షణాలున్నాయని శాస్త్రవేత్తలు తొలుత అంచనా వేశారు. కానీ, కోవిడ్–19లో సార్స్ వైరస్ లక్షణాలు ఏమాత్రం లేవని, హెచ్1ఎన్1 వైరస్ లక్షణాలు ఉన్నట్లు భావిస్తున్నారు. కోవిడ్–19 వైరస్ స్వైన్‌ప్లూకి దగ్గరగా ఉన్నట్టు సింగపూర్ మినిస్టర్ ఫర్ నేషనల్ డెవలప్‌మెంట్ లారెన్స్‌ఓంగ్ తెలిపారు. ఇది సార్స్ కన్నా అత్యంత వేగంగా ఇతరులకు సోకే ప్రమాదం ఉందని జాతీయ అంటువ్యాధుల కేంద్రం (ఎన్‌సీఐడీ) పరిశోధకులు వెల్లడించారు.
మాస్క్‌ల తయారీలో బడా కంపెనీలు
కోవిడ్ వైరస్‌పై యుద్ధం ప్రకటించిన చైనా బాధితుల కోసం పది రోజుల్లో 1,000 పడకల ఆసుపత్రిని సిద్ధం చేసింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ పరికరాలు, ఐఫోన్లు, ఐపాడ్‌లు తయారుచేసే ఫాక్స్‌కాన్ కంపెనీ తన ఉత్పత్తులను నిలిపివేసి, కోవిడ్ వైరస్ వ్యాప్తిని అడ్డుకునే మాస్క్‌ల తయారీని చేపట్టింది. ఈ నెల చివరి నాటికి రోజుకి 20 లక్షల మాస్కులను తయారు చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. అమెరికా దిగ్గజ కార్ల తయారీ సంస్థ జనరల్ మోటార్స్(జీఎం) కూడా రోజుకు 17 లక్షల మాస్క్‌లను తయారు చేయునున్నట్టు ప్రకటించింది.
Comments
Please login to add a commentAdd a comment