చైనా రాజధాని బీజింగ్‌లో జిన్‌ఫాదీ ఫుడ్ మార్కెట్ వద్ద పోలీసుల గస్తీ
బీజింగ్: చైనా రాజధాని బీజింగ్‌లో మళ్లీ కరోనా గుబులు మొదలైంది. మూడు రోజుల్లో 46 మందికి కరోనా సోకినట్టు నిర్ధారణ కావడంతో అధికారులు నియంత్రణ చర్యల్లో నిమగ్నమయ్యారు. కొత్తగా కేసులు ప్రబలుతున్న ప్రాంతాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నారు. నగరంలోని ఆరు మార్కెట్లను శనివారం మూసివేశారు. ఓ మార్కెట్‌లో సాల్మన్ చేపలను కోసే చెక్కమీద కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తించారు. దీంతో నగరంలో పలుచోట్ల చేపల విక్రయాలను నిలిపివేశారు. బీజింగ్‌లో తాజాగా 46 మందికి కరోనా సోకిందని గ్లోబల్ టైమ్స్ పత్రిక వెల్లడించింది. ఈ 46 మంది స్థానిక మార్కెట్‌కి వెళ్లారని, వీరిలో కరోనా లక్షణాలేవీ కనిపించలేదని అధికారులు తెలిపారు. కరోనా పాజిటివ్ వచ్చినవారందరినీ వైద్యుల పర్యవేక్షణలో ఉంచామని వెల్లడించారు.
రెండు నెలలుగా సురక్షితంగా ఉన్న బీజింగ్‌లో కొత్తగా కోవిడ్ కేసులు బయటపడటంతో అధికారుల్లో ఆందోళన నెలకొంది. కరోనా ఆనవాళ్లు గుర్తించిన మార్కెట్‌కి దగ్గర్లో ఉన్న 11 నివాస సముదాయాలను లాక్‌డౌన్ చేశారు. మూడు పాఠశాలలు, కిండర్‌గార్టెన్‌లలో తరగతులను రద్దు చేశారు. మే 30 వ తేదీ నుంచి ఈ మార్కెట్‌ని సందర్శించిన వారికి కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించాలని యోచిస్తున్నారు. ప్రస్తుతం బీజింగ్‌లోని 98 న్యూక్లియిక్ యాసిడ్ టెస్టింగ్ కేంద్రాల్లో రోజుకి 90,000 పరీక్షలు నిర్వహిస్తున్నట్టు నగర ఆరోగ్య కమిషన్ అధికార ప్రతినిధి గువా షియాజన్ చెప్పారు. లక్షణాలు కనిపించకున్నా కరోనా పాజిటివ్‌గా నమోదైన వారిని క్వారంటైన్‌లో ఉంచినట్టు అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్న 74 మందితో సహా చైనాలో ఇప్పటి వరకు 83,075 మందికి కరోనా సోకింది.
Comments
Please login to add a commentAdd a comment