బ్రిటన్ కొత్త నోట్లకు యమ క్రేజ్
బ్రిటన్ కొత్త నోట్లకు యమ క్రేజ్
Published Sat, Oct 22 2016 5:54 PM | Last Updated on Fri, Mar 22 2019 7:18 PM
బ్రిటన్ ప్రభుత్వం ఇటీవల మార్కెట్‌లోకి విడుదల చేసిన ఐదు పౌండ్ల కొత్త ప్లాస్టిక్ నోట్లు సంచలనం సష్టించడంతోపాటు కలకలం రేపుతున్నాయి. క్రేజీ సీరిస్, క్రేజీ నెంబర్లు వచ్చిన వారు వాటిని 'ఈబే'లో విక్రయిస్తూ తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఎక్కువ రేటు వచ్చిన వారు ఆనందిస్తుండగా, తక్కువరేటు వచ్చినవారు సిల్లీ రేటంటూ వాపోతున్నారు. ఎక్కువ బిడ్ పలికినా సొమ్ము చేతికి రానివారు లబోదిబోమని విలపిస్తున్నారు.
గరేత్ రైట్ అనే కుర్రవాడు కూడా తన ఐదు పౌండ్ల నోటుకు ఏకంగా 80 వేల పౌండ్ల ధర పలకగా ఎగిరి గంతేశాడు. పండుగ చేసుకుందామని మార్కెట్‌కు వెళ్లి ఓ పెద్ద చేపను కొనుక్కొచ్చాడు కూడా. ఆ సందర్భంగా ఫొటో కూడా దిగాడు. చివరకు 80 వేల పౌండ్లకు బిడ్డింగ్ పాడిన ఆసామి కాస్తా డబ్బులు చెల్లించడానికి మొరాయిస్తుండడంతో బిక్కమొహం వేశాడు. తాను క్యాష్ మిషన్ నుంచి పది పౌండ్లు డ్రా చేయగా, రెండు కొత్త ప్లాస్టిక్ ఐదు పౌండ్ల నోట్లు వచ్చాయని, వాటిలో ఓ నోటుపై 'ఏకే 47 నెంబర్' సిరీస్ కనిపించడంతో దానికి క్రేజ్ ఉంటుందని ఊహించి ఈబేలో వేలం పెట్టానని గరేత్ చెప్పాడు.
తన నోటుకు ఈసారి ఎవ్వరికీ లేనంతగా వంద బిడ్లు వచ్చాయని, వెయ్యి రూపాయలకు చేరిన బిడ్డింగ్ క్రమక్రమంగా రెండు, పది, ఇరవై, ముప్పై, యాభై, ఆరవై వేల చొప్పున పెరుగుతూ పోయిందని, మొదట ఉద్విగ్నానికి లోనైన తాను బిడ్డింగ్ భారీగా పెరగడంతో ఆందోళనకు గురయ్యానని, చివరకు ఆందోళనే మిగిలిందని గరేత్ తెలిపాడు. ఎక్కువ బిడ్డింగ్ పలికిన వ్యక్తిని సంప్రదించగా, తాను ఓ డ్రగ్ స్మగ్లర్‌నని, కొకైన్ కంటైనర్ కలిగిన ఓ నౌక రావాల్సి ఉందని, అది వచ్చాకే డబ్బులు ఇస్తానని చెబుతున్నాడని, ఈ విషయమై ఈబే నిర్వాహకులు సాయం కోరినా వారు తామేమీ చేయలేమంటూ చేతులు దులుపుకున్నారని గరేత్ వాపోయాడు.
క్రేజీ సిరీస్, నెంబర్లకు మార్కెట్లో గిరాకీ పెరుగుతుండడంతో క్యాష్ మిషన్ల నుంచి వచ్చే ఐదు పౌండ్ల నోట్లపై ప్రజలు దష్టిపెట్టారు. ఎవరికి వారు తమకు ఏ నెంబర్ వచ్చిందని చూసుకుంటున్నారు. ఓ వ్యక్తికి తన ఫోన్ నెంబర్, తనకొచ్చిన నోటు నెంబర్ ఒకటే కావడంతో తెగ మురిసిపోతున్నాడు. ఇటీవల ఈ నోట్లను మార్కెట్లోకి విడుదల చేసిన బ్రిటన్ ప్రభుత్వం సిరీస్‌లో ఒకటో నెంబర్ నోటును ఆనవాయితీగా బ్రిటిష్ రాణికి అందజేశారు.
Advertisement
Advertisement