కోళ్ల పందెం కాదు.. గుర్రాల పందెం!
బీజింగ్: సంక్రాంతి వచ్చిందంటే మన దగ్గర కోడి పందాలు సందడి చేస్తాయి. కోడిపుంజులు ఒక దానితో ఒకటి తలపడుతుంటే ఏది నెగ్గుతుందా అని చిన్నాపెద్దా అంతా చేరి ఆ పోరును ఆసక్తిగా చూస్తారు. చైనాలో కొత్త సంవత్సరం వేడుకల సందర్భంగా కూడా ఇలాంటి పోటీలే నిర్వహిస్తారు. అయితే వారు మాత్రం ఆ పందేలను గుర్రాలతో నిర్వహిస్తారు. గుర్రపు పందెం అంటే గుర్రాల మధ్య రన్నింగ్ రేస్ అనుకుంటున్నారా.. అయితే పప్పులో కాలేసినట్లే. అచ్చం కోడిపుంజుల మాదిరిగానే రెండు గుర్రాలు పోట్లాడుకుంటాయి.
కోడి పుంజులు ఒక దానికి ఒకటి ఎదురుపడగానే పోట్లాడుకుంటూనే ఉంటాయి. మరి గుర్రాలు ఎందుకు అలా పోట్లాడుకుంటాయి అనుమానం వస్తుంది కదూ. దీనికోసం ఓ టెక్నిక్ వాడుతారు. ఓ ఆడగుర్రాన్ని ముందుగా రింగ్లోకి వదిలిన తర్వాత.. రెండు మగ గుర్రాలను వదులుతారు. ఆ ఆడగుర్రాన్ని ఇంప్రెస్ చేయడానికి రెండు మగగుర్రాలు కోడిపుంజుల మాదిరిగా పోట్లాడుకుంటాయి. మగ గుర్రాలను ఉత్సాహపరుస్తూ ఆడగుర్రం రింగ్ చుట్టూ తిరగుతుంది. పోటీలను చూసేవారు గుర్రాలపై జోరుగా బెట్టింగ్ లు నిర్వహిస్తారు.
దక్షిణ చైనాలోని మియావో ప్రాంతంలో 500 ఏళ్లుగా కొనసాగుతున్న ఈ సంప్రదాయాన్ని పెద్ద ఉత్సవంలా నిర్వహిస్తున్నారు. దీనిపై జంతుప్రేమికుల నుంచి నిరసనలు వ్యక్తమౌతున్నా నిర్వాహకులు మాత్రం తమ పూర్వీకుల సాంప్రదాయాన్ని కొనసాగిస్తామంటున్నారు.