బ్యాంకాక్ : సైనిక చర్యతో అధికారాన్ని హస్తగతం చేసుకుని పరిపాలన సాగిస్తోన్న ఆర్మీ చీఫ్ జనరల్, థాయ్‌లాండ్ ప్రధాని ప్రయూత్ చాన్ ఓచా చర్యలు ప్రజలతో పాటు మీడియా సంస్థలకూ చిర్రెత్తుకొస్తుంది. సోమవారం ఓ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని ప్రయూత్‌ను కొందరు మీడియా ప్రతినిధులు వరుస ప్రశ్నలతో ఉక్కిరిబిక్కిరి చేశారు. అయితే వారి ప్రశ్నలకు బదులివ్వకుండానే దిమ్మతిరిగిపోయేలా ప్రవర్తించారు ప్రధాని. వేదిక మీద ఏర్పాటు చేసిన కటౌట్‌ను చూపిస్తూ ఆయనకు మీ ప్రశ్నలు సంధించాలంటూ జర్నలిస్టులకు సూచిస్తూ నవ్వుతూ వెళ్లిపోయారు ప్రయూత్.
త్వరలో నిర్వహించనున్న బాలల దినోత్సవం ఏర్పాట్లపై ప్రధాని ప్రసంగించారు. అనంతరం మీడియా ప్రతినిధులు దేశంలో నెలకొన్న ఆర్థిక, రాజకీయ సంక్షోభాలను ఏ విధంగా ఎదుర్కొంటారు. మీ పరిపాలనపై ప్రజలు విముఖత వ్యక్తం చేస్తున్నారని.. సమర్థవంతంగా పాలన సాగించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలనుకుంటున్నారని ప్రధాని ప్రయూత్‌ను ప్రశ్నించారు. ఈ ప్రశ్నలతో తీవ్ర అసహనం వ్యక్తం చేసినప్పటికీ ఎంతో కూల్‌గా బదులిచ్చారు. తన కటౌట్‌ను చూపిస్తూ.. మీ ప్రశ్నలకు ఆయన కచ్చితంగా సరైన సమాధానం చెబుతారంటూ చిరునవ్వులు చిందించడంతో ప్రధానిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయన చెప్పిన వెంటనే ఓ అధికారి మైక్ ముందుకు ప్రధాని కటౌట్‌ను తీసుకురావడం గమనార్హం.
2014లో అప్పటి ప్రధాని ఇంగ్లక్ షినవాత్రా ప్రభుత్వంపై మిలటరీ తిరుగుబాటు కుట్ర పన్ని ఆర్మీ చీఫ్ జనరల్ ప్రయూత్ చాన్ ఓచా అధికారం హస్తగతం చేసుకున్నారు. ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత మిలటరీ బలాన్ని రోజురోజుకు పటిష్టం చేసుకుంటూ వస్తున్న ప్రయూత్ అవినీతిని అరికట్టడంలో విఫలమయ్యారని, ఇకనైనా ప్రజాస్వామ్య పద్ధతిలో శాంతియుతంగా పరిపాలన కొనసాగించాలంటూ వ్యతిరేకత వస్తున్నా పట్టించుకోవడం లేదు.
Comments
Please login to add a commentAdd a comment