జిమ్‌లో కొన్ని కోట్ల బ్యాక్టీరియా!
లావొక్కింత తగ్గించుకోవాలనే తపనతోనో, జీరో సైజ్ కోసమో, సిక్స్ ప్యాక్ సాధించాలనే పట్టుదలతోనే నేటి యువత జిమ్‌ల వెంట పరుగుతీస్తున్న విషయం తెల్సిందే. అయితే జిమ్ పరికరాలపై మనకు హానికరమైన కొన్ని కోట్ల బ్యాక్టరియా ఉంటుందన్న విషయం ఎంత మందికి తెలుసు? ఇది తెలుసుకోవడం కోసమే ‘ఫిట్ రేటెడ్’ సంస్థ జిమ్‌లోని 27 పరికరాలపై పరిశోధనలు జరిపి కొన్ని కోట్ల బ్యాక్టీరియా ఉందని కనిపెట్టింది.
ప్రతి జిమ్ పరికరంపైనా పది లక్షలకు మించి జెర్మ్స్ ఉంటాయని పరిశోధనలో తేలింది. ట్రెడ్‌మిల్ స్క్రీన్‌ను టచ్ చేసినప్పుడల్లా, ఫ్రీ వెయిట్‌ను పట్టుకున్నప్పుడల్లా బ్యాక్టీరియా జిమ్ యూజర్లపై దాడి చేస్తుంది. దీని వల్ల నిమోనియా లేదా సెప్టిసేమియా, చర్మ వ్యాధులు సంక్రమిస్తాయి.
► ట్రెడ్‌మిల్‌పై పబ్లిక్ టాయ్‌లెట్ కన్నా 74 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది.
► ఫ్రీ వెయిట్స్‌పై సరాసరి టాయ్‌లెట్ సీటుకన్నా 362 రెట్లు ఎక్కువ బ్యాక్టీరియా ఉంటుంది.
► ఎక్సర్‌సైజ్ బైక్‌పై స్కూల్ కేఫ్ ట్రేకన్నా 39 రెట్లు బ్యాక్టీరియా ఉంటుంది.
► అన్ని మూడు రకాల పరికరాలపై గ్రామ్ పాజిటివ్ కొస్సీ బ్యాక్టీరియా ఉంటుంది. ఇది స్కిన్‌తోపాటు ఇతర ఇన్‌పెక్షన్లను కలిగిస్తుంది. ఈ రకమైన బ్యాక్టీరియా యాంటీ బయాటిక్స్‌కు కూడా లొంగదు.
►ఫ్రీ వెయిట్స్, ఎక్సర్‌సైజ్ బైక్‌పైనా బసిల్లస్ బ్యాక్టీరియా కూడా ఉన్నట్టు వెల్లడైంది. దీని వల్ల చెవి, కళ్లు, శ్వాసకోశ ఇన్‌ఫెక్షన్లు వస్తాయి.
జిమ్ పరికరాలను రోజుకు ఎంతో మంది ఉపయోగిస్తుండడం వల్ల, వారి నుంచి కారే చెమట బిందువులతో కలసి బ్యాక్టీరియా విస్తరిస్తుందని నిపుణులు తెలిపారు. వాటిని వెంటవెంటనే యాంటీ బ్యాక్టీరియా రసాయనాలతో శుభ్రం చేయకపోవడం వల్ల ఈపరిస్థితి ఏర్పడుతోందని చెప్పారు. బ్యాక్టీరియా భయంతో జిమ్‌ను మానేయాల్సిన అవసరం లేదని, తగిన జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుందని వారు చెబుతున్నారు.
జాగ్రత్తలు
జిమ్‌లోకి ప్రవేశించగానే యాంటీ బ్యాక్టీరియా జెల్ లేదా రసాయనంతో చేతులు కడుక్కోవాలి. శుభ్రమైన టవల్‌తో తుడుచుకోవాలి. అదే జెల్‌తో మనం పట్టుకోబోయే ప్రతి జిమ్ పరికరాన్ని శుభ్రం చేసుకోవాలి. ఆ తర్వాతే దాన్ని ఉపయోగించాలి.
ప్రతి పరికరం వర్కవుట్ తర్వాత మళ్లీ చేతులు జెల్‌తో కడుక్కోవాలి. ఇంటికి వెళ్లేటప్పుడు కూడా శుభ్రంగా చేతులు కడుక్కొని వెళ్లాలి. వెళ్లాక జిమ్ బట్టలను నీటిలో తడిపి ఉతికేసుకోవాలి. ఇదంతా శ్రమెందుకు అనుకునేవారు ఇంట్లోనే జిమ్ ఏర్పాటు చేసుకోవడం మంచిది.