
టెర్రరిస్టులపై పోరుకు డెల్టా ఫోర్స్
గుట్టుచప్పుడు కాకుండా ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించడంలో ప్రసిద్ధి చెందిన అమెరికా సైన్యంలోని 'డెల్టా ఫోర్స్' ఇరాక్‌లోని ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్టులను తుద ముట్టించేందుకు రంగంలోకి దిగిందని అమెరికా సైనికవర్గాల ద్వారా తెలిసింది. డెల్టాఫోర్స్‌కు చెందిన దాదాపు 200 మంది సైనికులు ఇరాక్‌లో మకాం వేసి టెర్రరిస్టుల నాయకుల గురించి, వారి స్థావరాల గురించి సమాచారాన్ని సేకరిస్తున్నారు. ఇంతకాలం డ్రోన్‌ల ద్వారా ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్టులపై దాడులు జరిపిన డెల్టా ఫోర్స్ ఇప్పుడు టెర్రరిస్టులతో భూతల యుద్ధానికి సన్నద్ధమవుతోంది.
గతంలో అఫ్ఘానిస్తాన్, ఇరాక్‌లలో ప్రత్యేక ఆపరేషన్లు నిర్వహించిన అనుభవం ఉన్న ఈ ఫోర్స్ ఇప్పటికే ఆరు టెర్రరిస్టు స్థావరాలను గుర్తించినట్లు తెలిసింది. టెర్రరిస్టులను వీలైతే సజీవంగా పట్టుకోవడం, లేదంటే హతమార్చడం, వారి చెరలో ఉన్న బందీలను విడిపించడం ఇప్పుడు ప్రధాన లక్ష్యం. సామాన్య పౌరులకు ప్రాణ నష్టం జరగుకుండా అతి జాగ్రత్తగా ఆపరేషన్లను నిర్వహించడంలో డెల్టాఫోర్స్ దిట్ట. ఉన్నతాధికారుల ఆదేశాల కోసం ఎదురుచూడకుండా సమయానుకూలంగా ఆపరేషన్లు నిర్వహించే స్వేచ్ఛ ఈ ఫోర్స్‌కు ఉంది. కొన్ని సందర్భాల్లో మాత్రమే అమెరికా అధ్యక్షుడిని అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది.
ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్టులను తుద ముట్టించేందుకు ప్రత్యేక దళాలను ఇరాక్‌కు పంపిస్తున్నామని, అమెరికా రక్షణ మంత్రి ఆష్ కార్టర్ గత డిసెంబర్‌లోనే ప్రకటించడం 'డెల్టా ఫోర్స్' ఇరాక్‌లో మకాం వేసిందన్న విషయాన్ని రుజువు చేస్తోంది. ప్రత్యేక దళం దాడులతో ఐఎస్‌ఐఎస్ టెర్రరిస్టులు ఎక్కడున్నా భయంతో చావాల్సిందేనని కూడా ఆయన వ్యాఖ్యానించారు. 2015, మే నెలలో సిరియాలోని ఓ ఐఎస్‌ఐఎస్ స్థావరాన్ని లక్ష్యాంగా చేసుకొని డెల్టా ఫోర్స్ జరిపిన దాడిలో వాంటెడ్ టెర్రరిస్టు అబు సయ్యద్ మరణించగా, ఆయన భార్య పట్టుబడింది. ప్రస్తుతం సిరియాలో దాడులు జరిపే ఉద్దేశం డెల్టాఫోర్స్‌కు లేదు. స్థానికంగా సహాయం చేసే స్థితిలో ప్రభుత్వ దళాలు లేవు. ఇరాక్‌లో ప్రభుత్వ సైనికులు, టెర్రరిస్టు వ్యతిరేక దళాలు డెల్టా ఫోర్స్‌కు సహకరిస్తున్నాయి. ఇరాక్‌లో దాడుల ఏర్పాట్లలో ఉన్న ఈ ఫోర్స్ ఎప్పుడు దాడులు ప్రారంభించేదీ ఇంకా తెలియదు.