ముట్టుకుంటే మటాషే! | Do not touch over poisonous creatures | Sakshi
Sakshi News home page

ముట్టుకుంటే మటాషే!

Published Sat, Oct 22 2016 10:09 AM | Last Updated on Wed, Sep 5 2018 2:07 PM

Do not touch over poisonous creatures

కొన్ని జీవులు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. చూడగానే మనసును ఆకట్టుకుంటాయి! ఒకసారి చేతిలోకి తీసుకొని వాటితో సరదాగా ఆడుకోవాలనిపిస్తుంది. అలాగని వాటిని మనం ముట్టుకున్నామంటే మటాషే! వినడానికి వింతగా ఉన్నప్పటికీ ఇది నిజంగా నిజం! కావాలంటే చదివి మీరే తెలుసుకోండి!            

షాక్‌ కొట్టే ఈల్‌!
చేపే కదా అని ముట్టుకుంటే షాక్‌ కొట్టేస్తుంది! ఇది ఇక్కడ కనిపించే చేప గురించి చేప్పే మాట! దీన్ని ఎలక్టిక్ర్‌ ఈల్‌ అంటారు. దీన్ని ముట్టుకుంటే గట్టి షాక్‌ తగులుతుంది. దాదాపు ఆరు వందల ఓల్టుల దాకా కరెంటును ఉత్పత్తి చేస్తుంది. దక్షిణ అమెరికాలోని అమేజాన్, ఓరినోకో ప్రాంతాలకి చెందిన చెరువుల్లో, నదుల్లో బతుకుతుంది. కేవలం చేపలనే కాక, కొన్ని ఉభయచరాలని, పక్షులని కూడా భక్షిస్తుంది. ఇవి శ్వాస మీద బతికే జంతువులు. కనుక నీట్లోంచి బయటికి తరచు వచ్చి గాలి పీల్చుకోవాల్సి వస్తుంది. వీటి కంటి చూపు మందంగా ఉంటుంది. విమానాలు, ఓడలు రాడార్‌ సంకేతాలతో లక్ష్యాల దూరాలు తెలుసుకున్నట్టు, గబ్బిలాలు శబ్దతరంగాలతో చుట్టూ ఉన్న వస్తువుల దూరాలు తెలుసుకున్నట్టు, ఈ జలచరం విద్యుత్‌ ప్రవాహాన్ని వెలువరించి అది పరిసరాలలో విస్తరించే తీరును బట్టి చుట్టూ ఉండే వస్తువుల స్థానాలని నిర్ణయిస్తుంది. ఈ ప్రక్రియనే ‘విద్యుత్‌ స్థాన నిర్ణయం’ అంటారు.

 సగటు ఎలక్టిక్ర్‌ ఈల్‌ పొడవు ఎనిమిది అడుగుల దాకా ఉంటుంది. బరువు 20 కిలోల వరకు ఉండొచ్చు. సగటు ఆయుర్దాయం 15 ఏళ్లు. పొడవుగా, పాము లాంటి శరీరంతో ఉంటుంది. నిలువెల్లా గోధుమ రంగు మచ్చలు కనిపిస్తాయి. దీని దెబ్బకి మనుషుల ప్రాణాలు పోయిన సంఘటనలు అరుదే అయినా ఇది కొట్టే షాక్‌ వల్ల మనుషుల ప్రాణాలకి ప్రమాదం లేకపోలేదు. దీని షాక్‌ తగిలి గుండె ఆగిపోవడం, శ్వాస నిలిచిపోవడం వంటివి జరిగి, స్థాణువైన మ నుషులు ఈదలేక నీట మునిగిపోయిన సంఘటనలు ఉన్నాయి.

ఒళ్లంతా విషమే!
నారింజ, నలుపు రంగుల్లో ఈ పక్షి.. చూడటానికి చాలా అందంగా ఉంది కదూ! మధురంగా పాడుతుంది కూడా. అలాగని పట్టుకుందామనిపిస్తోందా? ప్రమాదం కొని తెచ్చుకున్నట్టే! చెట్టు కొమ్మ మీద ఉంటే చూసి ఆనందించడమే మంచిది. పట్టుకున్నారో ప్రమాదమే. ఎందుకంటే  దాన్ని తాకితే చాలు, దాని ఈకలు, శరీరంపై ఉండే విషం ఎక్కేస్తుంది. తోటి జీవులకే కాదు, మనుషులకి కూడా అది ప్రమాదమే. ఒళ్లంతా తిమ్మిరి పట్టడం, తల తిరగడం వంటిలక్షణాలు కలిగి ఒకోసారి పక్షవాతం రావడం, మరణించడం కూడా జరిగే ప్రమాదముంది. అందుకే ఇది ప్రపంచంలో ఉన్న పక్షులన్నింటిలో విషపూరితమైనదిగా పేరు తెచ్చుకుంది. తోక నుంచి ముక్కు దాకా ఎక్కడ తాకినా అంతా విషమయమే.

న్యూగినియా అడవుల్లో కనిపించే ఈ పక్షి పేరు పితోహి. చర్మం, ఈకలపై ఒకరకమైన విషరసాయనం ఉంటుంది. ఇదే దానికి రక్షణ కవచం కూడా. పాములు, ఇతర జంతువుల నుండి రక్షించుకోడానికి ఉపయోగపడుతుంది. విచిత్రమేమిటంటే ఈ విషం దాని శరీరంలో ఉత్పత్తి కాదు. అది తినే ఆహారం ద్వారా ఏర్పడుతుంది. ఇవి ఎక్కువగా కోరెసైన్‌ అనే కీటకాలను ఆరగిస్తూ ఉంటాయి. వాటిలో ఉండే విషాన్నే దీని చర్మం, ఈకలు స్రవిస్తూ ఉంటాయి. జీవులన్నింటిలో అత్యంత ప్రమాదకరమైన జీవిగా ‘పాయిజన్‌ డాట్‌ కప్ప’ని పేర్కొంటారు. దాని శరీరంపై ఉండే విషరసాయనమే దీనిపై కూడా ఉంటుందని కనుగొన్నారు. న్యూగినియా గిరిజనులకు వీటి గురించి ముందే తెలుసు. వీటిని వాళ్లు ‘గార్బేజ్‌ బర్డ్స్‌’ అంటారు. అంటే చెత్త పక్షులన్నమాట. వీటి శరీరం నుంచి దుర్వాసన వస్తుంటుంది. అందుకే ఆ పేరు. వీటిలో ఆరు జాతులుంటే, మూడు విషపూరితమైనవే.

అంతా ఇంతా కాదు!
చిత్రంలో కప్పను చూశారా. చూడటానికి ఎంతో ఆకర్షణీయంగా ఉంది కదూ! పేరు గోల్డెన్‌ డాట్‌ ఫ్రాగ్‌. కానీ దాని గురించి చెప్పాల్సిన మరో నిజం ఒకటుంది. దాని చర్మంపై రంగులతో పాటు విషాన్ని కూడా నింపుకొని ఉంటుందట.! ప్రపంచంలోనే అత్యంత విషపూరిత జీవిగా పేరుగాంచింది. ఈ కప్పలో ఉన్న విషంతో 20 వేల ఎలుకలను చంపొచ్చొట! అయితే మనం దీన్ని ముట్టుకోగానే విషం ఎక్కదు. నోట్లో పెట్టుకుంటోనో, కళ్లు, ముక్కు లాంటి చోట్ల లేదా ఏదైనా గాయం తగిలిన చోట్ల ఈ కప్ప విషం తగిలితే ప్రభావం ఉంటుంది. ఈ విషం వల్ల రక్తనాళాలు కుంచించుకుపోవటం, పక్షవాతం రావటం, కొన్ని సందర్భాలో చనిపోవటం కూడా జరుగుతుంది. పాయిజన్‌ డాట్‌ కప్పల్లో 200 రకాలు ఉన్నాయి. వీటి పరిమాణం ఒకటి నుంచి ఆరు సెంటీమీటర్లు ఉంటుంది. రంగులతో ఆకర్షించడమే కాదు.

విషంతో వేటాడి ఇతర కీటకాలనూ చంపేయ గలవు. ఇవి ఎక్కువగా ముదురు ఎరుపు, నీలం, పసుపు, లేదా ఆకుపచ్చ రంగుల్లో ఉంటాయి. వీటి చర్మంపై ఉండే గ్రంధుల ద్వారా విషం విడుదలవుతుంది. సమీపంలో ఉన్న ఇతర కీటకాలపై ఆ విషాన్ని వెదజల్లి చంపుతాయి. వీటికి దష్టి సామర్థ్యం కూడా ఎక్కువే. పది సంవత్సరాలకు మించి జీవిస్తాయి. దక్షిణ అమెరికా వర్షారణ్య ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయి. అక్కడి గిరిజనులు వాళ్ల బాణాలకు ఈ కప్ప విషం పూసి శత్రువులను చంపేందుకు ప్రయత్నిస్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement