సాధారణంగా పల్లెల్లో ఊ అంటే కాళ్ల కిందకొచ్చేసే కప్పలంటే భలే బాధ.. చిరాకూనూ. అలికిడి చేసినా, అరచినా.. అడ్డం వచ్చినా కాళ్లతో చప్పుడు చేసి, ఉష్ ఉష్ అంటూ బెదిరించి తరిమేస్తాం. అలాంటి కప్పలు విషం జిమ్ముతాయి అంటే బెంబేలెత్తాల్సిందేగా? అవును నిజం.. ఈ కప్పలు నిలువెల్లా విషాన్ని కక్కుతాయట. పాయిజన్ డార్ట్ ఫ్రాగ్ జాతికి చెందిన ఈ కప్పలు.. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన జీవులు. మధ్య అమెరికా, దక్షిణ అమెరికాలోని వర్షారణ్య ప్రాంతాల్లో ఎక్కువగా ఉంటాయివి. ఒంటి నిండా రంగులతో పాటు విషాన్నీ నింపుకుని తిరుగుతాయి.
ఒక కప్పలోని విషంతో 20 వేల ఎలుకలను చంపొచ్చంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అయితే ఈ కప్పను మనం ముట్టుకోగానే విషం ఎక్కదు. నోట్లో పెట్టుకుంటేనో.. కళ్లు, ముక్కుకు తగిలితేనో లేదా ఏదైనా గాయం ఉన్నచోట ఈ కప్ప విషం అంటితేనో.. ప్రమాదం పొంచి ఉంటుంది. ఈ విషం వల్ల రక్తనాళాలు కుచించుకుపోవడం, పక్షవాతం, కొన్ని సందర్భాల్లో మరణం కూడా సంభవించే ప్రమాదం ఉంది. పాయిజన్ డార్ట్ కప్పల్లో రెండు వందలకు పైగా జాతులు ఉన్నాయి. వీటి పరిమాణం 6 సెంటీమీటర్ల కంటే తక్కువే.
ఇవి కీటకాలను, చెదపురుగుల్ని, సాలెపురుగుల్ని, ఈగల్ని, చీమల్ని, దోమల్ని తమ రంగులతో ఆకర్షించి, పొడవాటి నాలుకతో విషం జిమ్మి.. చంపి తింటాయి.ఇవి ఎక్కువగా ముదురు ఎరుపు, నీలం, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో ఉంటాయి. వీటికి దృశ్యసామర్థ్యం కూడా ఎక్కువే. పది సంవత్సరాలకు మించి జీవిస్తాయి. ఆ పరిసరాల్లో జీవించే గిరిజనులు వారి బాణాలకు ఈ కప్ప విషాన్ని పూసి వేటకు వెళ్తుంటారు.
Comments
Please login to add a commentAdd a comment