వీడియోలో అడ్డంగా దొరికేసిన ట్రంప్
శ్వేతసౌధంలో రాజ్యం ఏలాలన్న రిపబ్లికన్ అభ్యర్థి డోనాల్డ్ ట్రంప్ ఆశలు గల్లంతయ్యేలా ఉన్నాయి. 2005 సంవత్సరంలో ఆయన మహిళల గురించి దారుణంగా కామెంట్ చేసిన వీడియో ఒకటి తాజాగా బయటపడింది. దాంతో ఆయన క్షమాపణ చెప్పాల్సి వచ్చింది. అయినా కూడా ఓటర్లు.. ముఖ్యంగా మహిళలు శాంతించే పరిస్థితి కనిపించడం లేదు. వాషింగ్టన్ పోస్ట్ పత్రిక దాదాపు 11 ఏళ్ల క్రితం నాటి ఆ వీడియోను సంపాదించింది. ''నేను వాళ్లను ఇప్పుడు ముద్దు పెట్టుకోవడం మొదలుపెట్టాను.. కేవలం ముద్దే.. నేను వేచి చూడలేదు. నువ్వు స్టార్ అయినప్పుడు వాళ్లు నిన్ను ముద్దు పెట్టుకోనిస్తారు'' అని ట్రంప్ అన్నట్లు ఆ వీడియోలో ఉంది. మహిళలను ముద్దుపెట్టుకోవడం, అసభ్యంగా తాకడం, వాళ్లతో లైంగిక కార్యకలాపాలలో పాల్గొనడం గురించి ఆయన చేసిన వ్యాఖ్యలన్నీ మైక్రోఫోన్‌లో రికార్డయ్యాయి. బిల్లీ బుష్‌తో మాట్లాడుతున్నట్లుగా ఈ వీడియో ఉంది.
అయితే ఇది చాలా సంవత్సరాల క్రితం జరిగిన ఒక ప్రైవేటు సంభాషణ అని ట్రంప్ అన్నారు. గోల్ఫ్ కోర్స్‌లో బిల్ క్లింటన్ తనకంటే ఇంకా చాలా దారునంగా మాట్లాడారని చెప్పారు. అయితే.. తన మాటలకు ఎవరైనా బాధపడితే మాత్రం తాను క్షమాపణలు కోరుకుంటున్నట్లు తెలిపారు. ఈ వ్యాఖ్యలపై ట్రంప్ ప్రత్యర్థి, డెమొక్రాటిక్ పార్టీ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ తీవ్రంగా మండిపడ్డారు. ''ఇది దారుణాతి దారుణం ఇలాంటి వ్యక్తి అధ్యక్షుడు అవ్వడానికి మనం అంగీకరించలేం'' అని ఆమె చెప్పారు. ఇలాంటి ప్రవర్తన హేయమని డెమొక్రాటిక్ పార్టీ ఉపాధ్యక్ష అభ్యర్థి సెనేటర్ టిమ్ కైన్ అన్నారు. ట్రంప్ సొంత పార్టీ వాళ్లు కూడా ఆయన క్షమాపణలను ఏమాత్రం అంగీకరించడం లేదు. ఇద్దరు అమ్మాయిలకు తాతగా.. ట్రంప్ మహిళల గురించి ఇలాంటి వ్యాఖ్యలు చేసి, ఇప్పుడు క్షమాపణలు చెప్పినా తాను వాటిని అంగీకరించలేనని రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష పదవికి పోటీపడిన జెబ్ బుష్ చెప్పారు. ప్రతినిధుల సభ స్పీకర్ పాల్ ర్యాన్ కూడా మహిళలపై ట్రంప్ వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. మహిళలు ఎవరైనా వాళ్ల గురించి ఇలాంటి మాటలు మాట్లాడకూడదని, ఎప్పుడూ అలా చేయకూడదని రిపబ్లికన్ పార్టీ జాతీయ కమిటీ చైర్మన్ రీన్స్ ప్రీబస్ చెప్పారు.