
ట్రంప్, హిల్లరీలకు టఫ్ ఫైట్
* గట్టి సవాల్ విసురుతున్న క్రూజ్, శాండర్స్
* ఉత్కంఠగా సాగిన సూపర్ సాటర్‌డే పోల్స్
బాటన్ రోగ్(లూసియానా): అమెరికా అధ్యక్ష ఎన్నికల నామినేషన్ రేసు ఉత్కంఠభరితంగా మారింది. డెమొక్రాటిక్ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం ఆశిస్తున్న హిల్లరీ, రిపబ్లికన్ పార్టీ తరఫున ముందంజలో ఉన్న ట్రంప్‌లకు గట్టి సవాల్ ఎదురవుతోంది. లూసియానా రాష్ట్రంలో జరిగిన ‘సూపర్ సాటర్‌డే’ పోల్స్‌లో ట్రంప్, హిల్లరీలకు క్రూజ్, శాండర్స్ షాక్ ఇచ్చారు. వీరు కొన్ని రాష్ట్రాల్లో విజయం సాధించడం ద్వారా రేసులోకి వచ్చారు. అయితే క్రూజ్, శాండర్స్ విజయం సాధించినా.. ట్రంప్, హిల్లరీలు అగ్రస్థానంలో కొనసాగుతున్నారు.
సూపర్ సాటర్ డే పోల్స్‌లో కాన్సస్, నెబ్రాస్కల్లో శాండర్స్ గెలిచారు. లూసియానాలో హిల్లరీ గెలిచారు. ఇక రిపబ్లికన్ల విషయానికి వస్తే కాన్సస్, మైన్ రాష్ట్రాల్లో క్రూజ్ గెలిచారు. లూసియానా, కెంటకీ రాష్ట్రాల్లో ట్రంప్ గెలిచారు. తాను క్రూజ్‌తో నేరుగా తలపడాలనుకుంటున్నానని, అందువల్ల రుబియో రేసు నుంచి తప్పుకోవాలని, తాను క్రూజ్‌పై విజయం సాధిస్తానని ట్రంప్ చెప్పారు. క్రూజ్ మాట్లాడుతూ.. ట్రంప్‌ను అడ్డుకోగలిగిన సత్తా తనకు మాత్రమే ఉందని, మిగతా అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకుంటే తనకు గెలుపు సులభమవుతుందని అన్నారు.
ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో రిపబ్లికన్ల తరఫున డొనాల్డ్ ట్రంప్ 385 డెలిగేట్ల ఓట్లు సాధించగా.. క్రూజ్ 298 ఓట్లు, రుబియో 126 ఓట్లు సాధించారు. రిపబ్లికన్ పార్టీ నామినేషన్ దక్కాలంటే కనీసం 1,237 ఓట్లు సాధించాల్సి ఉంటుంది. ఇక డెమొక్రాట్ల విషయానికి వస్తే ఇప్పటికే హిల్లరీ క్లింటన్ 1,131 డెలిగేట్ల ఓట్లు సాధించగా శాండర్స్‌కు 479 ఓట్లు మాత్రమే వచ్చాయి. నామినేషన్ దక్కాలంటే కనీసం 2,383 ఓట్లు సాధించాల్సి ఉంటుంది.