
న్యూయార్క్: అగ్రరాజ్యంలో మరో ఇండో- అమెరికన్ మహిళకు కీలక పదవి దక్కనుంది. భారత సంతతికి చెందిన సరితా కోమటిరెడ్డిని యూఎస్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఫర్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ జడ్జిగా నామినేట్ చేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవల ప్రకటించారు. అమెరికా న్యాయవ్యవస్థలోని వివిధ భాగాల్లో పనిచేసిన సరితా కోమటిరెడ్డి ప్రస్తుతం.. యూఎస్ అటార్నీ ఆఫీస్ ఫర్ ఈస్ట్రన్ డిస్ట్రిక్ట్ ఆఫ్ న్యూయార్క్ జనరల్ క్రైమ్స్ డిప్యూటీ చీఫ్‌గా పనిచేస్తున్నారు. గతంలో కూడా అదే కార్యాలయంలో... అంతర్జాతీయ నార్కోటిక్స్, మనీ లాండరింగ్.. కంప్యూటర్ హ్యాకింగ్ అండ్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ సమన్వయకర్తగా పనిచేశారు. అదే విధంగా బీపీ డీప్‌వాటర్ హారిజన్ ఆయిల్ స్పిల్ అండ్ ఆఫ్‌షోర్ డ్రిల్లింగ్ జాతీయ కమిషన్ తరఫున లాయర్‌గా బాధ్యతలు నిర్వర్తించారు. అలాగే కెలాగ్ హన్సెన్ టాడ్ ఫిజెట్ అండ్ ఫ్రెడెరిక్ సంస్థలో ప్రైవేటుగా ప్రాక్టీసు చేశారు.
చదవండి: ట్రంప్ నిష్టూరం!
కాగా హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి బీఏ పట్టా అందుకున్న సరితా కోమటిరెడ్డి.. హార్వర్డ్ లా స్కూల్ నుంచి జ్యూరిస్ డాక్టర్‌గా పట్టా పుచ్చుకున్నారు. అనంతరం న్యాయశాస్త్ర విభాగంలో లెక్చరర్‌గా పనిచేశారు. కొలంబియా లా స్కూల్, జార్జ్ వాషింగ్టన్ యూనివర్సిటీ లా స్కూల్‌లో విద్యార్థులకు న్యాయ పాఠాలు బోధించారు. అదే విధంగా యూఎస్ కోర్టు ఆఫ్ అప్పీల్స్ ఫర్ ది డిస్ట్రిక్ట్ ఆఫ్ కొలంబియా సర్క్యూట్ జడ్జి బ్రెట్ కావానా వద్ద లా క్లర్కుగా పనిచేశారు.
Comments
Please login to add a commentAdd a comment