వాషింగ్టన్: మహమ్మారి కరోనా వైరస్ విజృంభిస్తున్న తరుణంలో భౌతిక దూరం(సోషల్ డిస్టెన్సింగ్) నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నట్లు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వెల్లడించారు. ఇందులో భాగంగా వచ్చే నెల 30 వరకూ నిబంధనలు పొడిగిస్తున్నట్లు తెలిపారు. అదే విధంగా చైనా, యూరప్ ప్రయాణాలపై నిషేధం కూడా యథాతథంగా కొనసాగుతుందని.. కరోనాపై పోరాడేందుకు పౌరులంతా సహకరించాలని అమెరికన్లకు విజ్ఞప్తి చేశారు. సోమవారం శ్వేతసౌధంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ట్రంప్ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు దాదాపు 10 లక్షల మందికి కరోనా పరీక్షలు నిర్వహించినట్లు వెల్లడించారు. కరోనాపై పోరులో దీనిని మైలురాయిగా అభివర్ణించారు. (వైరస్ ప్లాస్టిక్‌పైన 72 గంటలు బతుకుతుంది)
ఇక కరోనా ప్రమాదం పొంచి ఉన్న నేపథ్యంలో పదికి మించి ఎక్కువ మంది ఒకేచోట ఉండకూడదని... అదే విధంగా రెస్టారెంట్లు, బార్లకు వెళ్లడం పూర్తిగా మానివేస్తే బాగుంటుందని ట్రంప్ సూచించారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే రానున్న రోజుల్లో మరిన్ని కఠిన నిబంధనలు అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. ‘‘ఈ యుద్ధంలో గెలవాలంటే ప్రతీ ఒక్కరి పాత్ర ఎంతో కీలకం. ప్రతీ పౌరుడు, కుటుంబం ఈ వైరస్ వ్యాప్తిని అరికట్టడంలో బాధ్యత వహించాలి. దేశభక్తిని నిరూపించుకునేందుకు మనం నిర్వర్తించాల్సిన కర్తవ్యం. వచ్చే 30 రోజుల మరింత సవాళ్లతో కూడుకున్నవి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి’’అని ట్రంప్ విజ్ఞప్తి చేశారు.(కరోనా: 64 దేశాలకు అమెరికా సాయం.. భారత్‌కు)
ఇటలీకి సాయం చేస్తాం..
మహమ్మారిని ఎదుర్కొనేందుకు ఇతర దేశాలకు సాయం అందించడంతో పాటుగా.. అత్యవసర పరిస్థితుల్లో కూడా తాము సాయం అడుగుతామని ట్రంప్ పేర్కొన్నారు. ‘‘ప్రపంచం నలుమూల నుంచి మాకు అవసరమైన వైద్య పరికరాలను తెప్పించుకుంటున్నాం. అదే విధంగా వారికి అవసరమైన సేవలు కూడా అందిస్తున్నాం. ఇటలీ ప్రధాని కోంటేతో మాట్లాడాను. అమెరికా వద్ద ఉన్న... 100 మిలియన్ డాలర్ల విలువ చేసే వైద్య పరికరాలు వారికి అందించడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పాను. 100 రోజుల్లో 50 వేల వెంటిలేటర్లు అందుబాటులోకి తెస్తామని ఫోర్ట్ మోటార్ కో, జనరల్ ఎలక్ట్రిక్స్ హెల్త్‌కేర్ ప్రకటించడం ప్రశంసనీయం. ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్ ఇలా వాటి అవసరం ఉన్న ప్రతీ ఒక్కరికి మేం సాయం అందిస్తాం’’అని ట్రంప్ హామీ ఇచ్చారు. కాగా కరోనాను నియంత్రించే చర్యల్లో భాగంగా 65 దేశాలకు అమెరికా ఇప్పటికే దాదాపు 274 మిలియన్ డాలర్ల ఆర్థిక సహాయం ప్రకటించిన విషయం తెలిసిందే. (తీవ్ర ఒత్తిడిలో ఆమెరికా వైద్య సిబ్బంది)
Comments
Please login to add a commentAdd a comment