వాషింగ్టన్: ప్రాణాంతక కోవిడ్-19 నిర్దారణ పరీక్షల నిర్వహణలో అమెరికా ముందుందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఇప్పటి వరకు తమ దేశంలో 50 మిలియన్ల మందికి పరీక్షలు నిర్వహించామని, అమెరికా తర్వాత భారత్‌లో అత్యధికంగా 12 మిలియన్ టెస్టులు జరిగాయని పేర్కొన్నారు. ఎవరైతే త్వరగా కరోనా బారిన పడే అవకాశం ఉందో ఇప్పటికే ఓ అవగాహన వచ్చిందని.. మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు వ్యూహాలు రచిస్తున్నామని తెలిపారు. ప్రతీ ఒక్క ప్రాణం విలువైనదేనని.. కరోనాతో మృత్యువాత పడిన వారికి నివాళిగా.. త్వరలోనే వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చి ప్రాణాంతక వైరస్‌ను ఓడిస్తామని ప్రతిజ్ఞ చేశారు. కోవిడ్-19 పరిస్థితులపై శ్వేతసౌధంలో మంగళవారం కాన్ఫరెన్స్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కరోనా కట్టడికి అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. అయితే దురదృష్టవశాత్తూ కొన్ని చోట్ల పరిస్థితులు చేజారిపోయాయని అసహనం వ్యక్తం చేశారు. యువతలో చాలా మందికి కరోనా వచ్చినా లక్షణాలు బయపడటం లేదని, అసలు అనారోగ్యం బారిన పడిన విషయం కూడా వారికి తెలియడం లేదన్నారు. కాబట్టి యువత బాధ్యతగా వ్యవహరించి తమతో పాటు ఎదుటి వారు వైరస్ బారిన పడకుండా జాగ్రత్త పడాలని ట్రంప్ సూచించారు. కరోనాతో మరణించే చిన్నారుల సంఖ్య అత్యల్పంగా ఉండటం కాస్త ఊరట కలిగించే విషయమని పేర్కొన్నారు. (‘వారు తల్చుకుంటే ఆపగలిగేవారు.. కానీ’)
చైనా వైరస్ విషపూరితం, హానికరం
అదే విధంగా కోవిడ్‌పై యుద్ధంలో ప్రతీ దశను, చికిత్సా విధానాలను ప్రపంచ దేశాలతో పంచుకుంటున్నామని, సమిష్టిగా పోరాడి మహమ్మారిని ఓడిస్తామని ధీమా వ్యక్తం చేశారు. చైనా వైరస్ విషపూరితం, హానికరమైందని ట్రంప్ ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు. ‘‘చైనాలో భయంకరమైన అంటువ్యాధి ప్రబలింది. వారు మాత్రం దాని నుంచి తప్పించుకున్నారు. అయితే అది ప్రపంచం మొత్తాన్ని ఇన్‌ఫెక్ట్ చేసింది. ప్రపంచ దేశాలను పట్టిపీడిస్తోంది. కానీ మేం దానితో ధైర్యంగా పోరాడుతున్నాం. ఇతర దేశాలకు ఎంతో సహాయం చేస్తున్నాం. కరోనా కారణంగా మరణించిన వారి కోసం మేం ఎంతగానో దుఃఖిస్తున్నాం. వారి గౌరవార్థం వ్యాక్సిన్ తీసుకువచ్చి వైరస్‌ను అంతం చేస్తాం’’అని ట్రంప్ పేర్కొన్నారు. కాగా అమెరికాలో ఇప్పటి వరకు కరోనాతో లక్షా నలభై వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. 3.8 మిలియన్ల మంది మహమ్మారి బారిన పడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment