
నేనేమీ మూర్ఖుణ్ని కాదు!
'నేనేమీ మూర్ఖుణ్ణి కాదు. మూర్ఖుడికి పూర్తి భిన్నమైనవాడిని. ఇక, రెండోవిషయం విచ్ఛినకారుడని నన్ను విమర్శించాడు. కానీ నేనేమీ విచ్ఛిన్నకారుణి కాదు. అందరిని కలిపేవాడిని. ప్రస్తుత అధ్యక్షుడు (ఒబామా) లాంటివాడిని కాదు.. అందరినీ ఐక్యంగా ఉంచేవాడిని నేను'.. బ్రిటన్ ప్రధానమంత్రి డేవిడ్ కామెరాన్ తనపై చేసిన విమర్శల పట్ల డొనాల్డ్ ట్రంప్ స్పందన ఇది. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ అభ్యర్థిగా బరిలోకి దిగడం దాదాపు ఖాయమైన డొనాల్డ్ ట్రంప్ తాజాగా కామెరాన్ విమర్శలపై నోరువిప్పారు.
తాను అమెరికా అధ్యక్షుడినైతే, కామెరాన్‌తో సత్సంబంధాలు ఉండబోవని తాను భావిస్తున్నట్టు చెప్పారు. భవిష్యత్తులో ఆయనతో సత్సంబంధాలు ఉంటే ఉండవచ్చునని, అయితే, సమస్య పరిష్కారానికి ఆయన సమ్మతిస్తేనే ఇందుకు వీలుంటుందని చెప్పారు. అమెరికాలో ముస్లింల ప్రవేశంపై తాత్కాలిక నిషేధం విధించాలన్న ట్రంప్ వ్యాఖ్యలను తప్పబడుతూ.. బ్రిటన్ పార్లమెంటు చర్చలో ప్రధాని కామెరాన్ మాట్లాడుతూ ' ట్రంప్‌ను ఒక మూర్ఖుడు. అతడో విచ్ఛిన్నకారుడు. అతడు బ్రిటన్‌లో అడుగుపెడితే అతనికి వ్యతిరేకంగా బ్రిటన్ అంతా ఏకమవుతుంది' అని తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. కామెరాన్ వ్యాఖ్యలపై ఒకింత అసహనంతో ట్రంప్ తాజాగా స్పందించాడు.