
ఘటనా స్థలంలో ప్రమాదానికి గురైన బస్సు
లిమా : పెరూలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. డబుల్ డక్కర్ బస్సు ఒకటి లోయలో పడిన ఘటనలో 44 మంది మృతి చెందారు. ఈ ఘటనలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి దాటాక ఇది చోటు చేసుకుంది.
సుమారు 45 మంది ప్రయాణికులతో బయలుదేరిన బస్సు అర్ధరాత్రి ప్యాన్ అమెరికా హైవే సమీపంలో ప్రమాదానికి గురైంది. సుమారు 260 ఫీట్ల లోయలోకి పడిపోవటంతో బస్సు నుజ్జునుజ్జు అయిపోయింది. తొలుత 35 మంది చనిపోయారని ప్రకటించిన అధికారులు.. తర్వాత 44 మృతదేహాలను వెలికి తీసినట్లు వెల్లడించారు. అయితే మార్గమధ్యంలో చాలా మంది బస్సు ఎక్కినట్లు క్షతగాత్రులు చెబుతున్నారు. దీంతో మృతుల సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది.
ప్రమాదం దాటికి చాలా వరకు మృతదేహాలు పక్కనే ఉన్న నదిలోకి ఎగిరిపడ్డాయి. వీటిని తీసేందుకు రక్షక సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. సహాయక చర్యలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ‘ప్రమాదకరమైన మలుపు.. పైగా చీకట్లో డ్రైవర్ మార్గాన్ని సరిగ్గా అంచనా వేయకపోవటం’తోనే ఈ ఘోరం జరిగి ఉంటుందని అధికారులు ప్రాథమిక విచారణకు వచ్చారు. సాయంత్రం కల్లా మృతుల సంఖ్యపై ఓ నిర్దారణకు వస్తామని చెబుతున్నారు.