
పారిస్‌లో వాహనాలకు నిప్పు పెడుతున్న ఆందోళనకారుడు
పారిస్: ఫ్రాన్స్‌లో ఇంధన, జీవన వ్యయాల పెరుగుదలకు నిరసనగా రెండువారాల నుంచి జరుగుతున్న ఆందోళనలు శని, ఆదివారాల్లో తీవ్ర హింసాత్మకంగా మారాయి. దీంతో ఫ్రాన్స్‌లో అత్యవసర స్థితి విధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ప్రభుత్వ అధికార ప్రతినిధి బెంజమిన్ గ్రైవాక్స్ వెల్లడించారు. జీ–20 సమావేశాల కోసం అర్జెంటీనా వెళ్లిన ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మేక్రాన్ అత్యవసరంగా పారిస్ చేరుకుని ప్రధాని, హోం మంత్రులతో సమావేశమై పరిస్థితిని సమీక్షించారు. హింస చోటుచేసుకున్న పలు ప్రాంతాలను కూడా ఆయన పరిశీలించారు. పెట్రోల్, డీజిల్‌లపై పన్నులు తగ్గించాలని కోరుతూ నిరసనకారులు నవంబర్ 17 నుంచి రాజధాని పారిస్‌తోపాటు పలుచోట్ల ‘యెల్లో వెస్ట్’ పేరుతో ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహిస్తున్నారు.
తాజాగా ఫ్రాన్స్‌లో చోటుచేసుకున్న విధ్వంసంలో 23 మంది భద్రతా సిబ్బంది సహా 263 మంది గాయపడగా, పలు వాహనాలు, భవనాలకు ఆందోళనకారులు నిప్పు పెట్టారు. ఒక్క పారిస్‌లోనే 133 మంది గాయపడ్డారు. ముఖాలకు ముసుగులు ధరించిన యువకులు ఇనుప రా డ్లు, గొడ్డళ్లు చేతబట్టి రోడ్లపైకి వచ్చి విధ్వంసం సృష్టించారు. పోలీసులు ప్రయోగించే బాష్పవాయువు నుంచి రక్షించుకునేందుకు కొందరు ఆందోళనకారులు గ్యాస్ మాస్క్‌లను, ప్రత్యేకమైన కళ్లద్దాలను ధరించారు. గొడవలకు కారకులైన 412 మందిని పోలీసులు అరెస్టు చేశారు. దశాబ్దకాలంలో ఫ్రాన్స్‌లో ఇంత భారీ స్థాయిలో ఆందోళనలు జరగడం ఇదే ప్రథమం
చర్చలకు రావాలి: ప్రభుత్వం
ఆందోళనకారులు హింసకు పాల్పడకుండా చర్చలకు రావాలని ఫ్రాన్స్ అధ్యక్షుడు మేక్రాన్ కోరారు. ‘హింసను నేను ఎన్నటికీ అనుమతించను. అధికార భవనాలపై దాడులు చేయడం, వాణిజ్య సముదాయాలను కొల్లగొట్టడం, రోడ్లపై వెళ్తున్న వారిని, విలేకరులను బెదిరించడం వంటి చర్యలకు ఏ కారణమూ సమర్థనీయం కాదు’ అని మేక్రాన్ చెప్పారు. యెల్లో వెస్ట్ ఉద్యమానికి ఓ నాయకుడు, నేతృత్వం వహించే పార్టీ/సంస్థ అంటూ ఏదీ లేదు. దీంతో ఎవరితో చర్చలు జరపాలో ప్రభుత్వానికి దిక్కుతోచడం లేదు.
పన్నులు పెంచి, డీజిల్ వినియోగం తగ్గించి పర్యావరణహిత ఇంధనాలవైపునకు ప్రజలను మళ్లించేందుకేననీ, ఈ విషయం వారికి సరిగా అర్థమయ్యేలా చెప్పలేకపోయామని కొందరు అధికారులు అభిప్రాయపడ్డారు. కార్పొరేట్ అనుకూలుడిగా పేరున్న మేక్రాన్ ఇప్పటివరకు పన్నులను తగ్గించేందుకు సానుకూలంగా స్పందించలేదు. అయితే మేక్రాన్ అధికారంలోకి వచ్చాక కంపెనీలపై పన్నులను తగ్గించడం, రాయితీలు ఇవ్వడం వంటివి చేశారు. దేశంలో నిరుద్యోగాన్ని తగ్గించేందుకు ఇవి అవసరమని ఆయన వాదన. మరోవైపు ఆందోళనలు హింసాత్మకంగా మారడానికి ప్రభుత్వమే కారణమని పలువురు నిరసనకారులు ఆరోపిస్తున్నారు.
పరిస్థితిని సమీక్షించేందుకు వెళుతున్న మేక్రాన్
Comments
Please login to add a commentAdd a comment