
న్యూయార్క్ : సెయింట్ క్రోయిక్స్ నదిలో అలలపై ఓ గ్రద్ద తేలుతూ వస్తోంది. పైకి ఎగరకుండా రెక్కలను లైఫ్ జాకెట్లుగా వాడుతూ నదిపై ఈదుతూ ఉంది. కొద్దిసేపటి తర్వాత ఒడ్డుకు చేరుకునే సమయంలో అది తన రెక్కలను తెడ్డుగా ఉపయోగించి నేలపైకి వచ్చింది. అంతే! అప్పటి వరకు దాన్ని వీడియో తీస్తున్న ఓ జంట ఆశ్చర్యానికి గురైంది. గాయం కారణంగా గ్రద్ద పైకి ఎగరలేకపోయిందనుకున్న వారు దాని తెలివికి ఫిదా అయ్యారు. అమెరికాకు చెందిన డాన్ గాఫ్ అనే వ్యక్తి తన ట్విటర్ ఖాతాలో షేర్ చేసిన ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
గ్రద్ద ఎందుకలా చేసింది?!.. వేటాడి పట్టుకున్న చేపను గాల్లోకి తీసుకెళితే అది ఊపిరాడక కావచ్చు.. తప్పించుకోవాలన్న ప్రయత్నంతో కావచ్చు.. గిలగిలా కొట్టుకుని కిందకు దూకే ప్రయత్నం చేస్తుంది. దాని నుంచి తప్పించుకుందంటే ఒక్కసారిగా వందల అడుగుల ఎత్తునుంచి చేప నీటిలో పడి, అది తేలిగ్గా నీటి అడుగుకు చేరి దొరక్కుండా పోతుంది. గ్రద్ద అంత ఎత్తునుంచి నీటిలోకి దూకేసరికే చేప తుర్రుమంటుంది. మరి గ్రద్ద ఇలా ఆలోచించిందో లేదో తెలియదు కానీ చేపను నీటిలోనే కాళ్లతో గట్టిగా అదిమిపట్టింది. ఒడ్డుకు చేరేంత వరకు ఆగి ఆ తర్వాత చేపను ఒడ్డుపైకి లాగింది.
Comments
Please login to add a commentAdd a comment