చైనాలో కనిపిస్తున్న వెరైటీ వైద్యం!
గ్జియాన్ః ఆరోగ్యంకోసం ప్రకృతి వైద్యాన్ని ఆశ్రయించడం ఆధునిక కాలంలోనూ చూస్తూనే ఉన్నాం. చెట్ల బెరళ్ళు, మూలికలు, కషాయాలను వాడి వ్యాధులు తగ్గించుకునే పాత పద్ధతులు పెద్దగా కనిపించకపోయినా... ఆయుర్వేదం, హోమియో, అలోపతితోపాటు.. అనేక ప్రకృతి వైద్యాలను ఆశ్రయిస్తున్నవారు లేకపోలేదు. సాంకేతికంగా అత్యంత అభివృద్ధి చెందిన చైనా దేశం కూడా అటువంటి వైద్యాలను ఆశ్రయించడంలో ముందే ఉంది. ఇప్పుడక్కడ కనిపిస్తున్న దృశ్యాలే అందుకు పెద్ద నిదర్శనం. ఎండలో కాలే కాలే రాళ్ళపై పడుకుంటే ఎన్నో రకాల రోగాలు నయమౌతాయంటున్నారు అక్కడి మహిళలు.
చైనా నగరం గ్జియాన్ కు చెందిన మహిళలు ఇప్పుడు ప్రకృతి వైద్యం బాట పట్టారు. తీక్షణమైన ఎండలో.. కాలే కాలే రాళ్ళపై పడుకొనే వెరైటీ వైద్యం చేసుకుంటున్నారు. అంతేకాదు అదో కొత్త హెల్గ్ ట్రెండ్ గా చెప్తున్నారు. ముఖాలపై చిన్నపాటి టవల్ నో, గుడ్డనో కప్పుకొని, ఎండలో ఉన్న అతిపెద్ద రాళ్ళను కౌగలించుకునో, వెల్లకిలానో పడుకొన్న మహిళలు కనిపించడం గ్జియాన్ ప్రాంతంలో ఇప్పుడు మామూలైపోయింది. వారికోసం పార్కుల్లోనూ, ఎండ తగిలే ఖాళీ ప్రదేశాల్లోనూ ప్రత్యేకంగా పెద్ద పెద్ద రాళ్ళను ఏర్పాటు చేస్తున్నారు. మొదట్లో అలా రాళ్ళపై పడుకున్న మహిళలను చూసి, అంతా అదో వ్యాయామం అనుకున్నారు. కానీ స్థానిక రిపోర్టర్లు వారిని కలిసిన తర్వాతే అసలు విషయం తెలిసింది. అదో ప్రాచీన వైద్య పద్ధతి అని, ముఖ్యంగా మహిళల్లో అనేక రోగాలను నయం చేస్తుందని చెప్పారు. సైనోవిటిస్, కండరాలు గట్టిపడటం వంటి వ్యాధులు వచ్చిన తన బంధువు ఒకరు ఇలా రాళ్ళ వైద్యాన్ని పాటించారని, కొన్నాళ్ళకు ఆమెకు పూర్తిగా నయం అయిపోవడంతో తాను కూడ ఈ వైద్యాన్ని అనుసరిస్తున్నట్లు 'లో' అనే మహిళ చెప్పింది. సుమారు సాయంత్రం 3, 4 గంటల మధ్య ప్రాంతంలో ఇలా రాళ్ళపై పడుకుంటే ఎంతో ఉపయోగం అని తెలిపింది. అలాగే లైంగిక శక్తి లోపించినవారికి సైతం ఈ వైద్యం అత్యంత ఉపయోగంగా ఉంటుందని చెప్తున్నారు.
అయితే గ్జియాన్ లో కనిపిస్తున్న వేడి రాళ్ళ వైద్యాన్ని డాక్టర్లు ఎంతమాత్రం సమర్థించడం లేదు. పైగా ఈ ప్రయత్నం అనేక ప్రమాదాలకు దారి తీసే అవకాశం ఉంటుందంటున్నారు. అధిక ఉష్ణోగ్రత శరీరానికి తగలడంవల్ల ప్రమాదాలు తలెత్తుతాయంటున్నారు. చర్మం బొబ్బలెక్కడం నుంచీ వడదెబ్బ తగలడం వరకూ ఏదైనా ప్రమాదమేనంటున్నారు. వైద్యులు వారించిన అనంతరం ఓ 70 ఏళ్ళ మహిళ తనకు అటువంటి అనుభవమే అయినట్టు స్థానిక మీడియాకు తెలిపింది. అలా రాళ్ళపై పడుకున్న తర్వాత, కాలిన వేడికి కడుపులో తీవ్రమైన నొప్పి ప్రారంభమైనట్లు చెప్పింది. అయితే చాలాశాతం మంది మీడియా చెప్పిన మాటలనూ వినడం లేదు. ఇప్పటికీ గ్జియాన్ నగరంలో రాళ్ళపై మహిళలు కనిపిస్తూనే ఉన్నారు. రాళ్ళపై పడుకోవడం ఒక్కటే కాదు.. అనేక వైద్యాలకు రాళ్ళను వినియోగించడం ఇటీవలి కాలంలో తరచుగా చూస్తున్నాం. ఓ వ్యక్తి తన ఒంట్లో అధికంగా ఉన్న 30 కేజీల బరువును తగ్గించుకునేందుకు తలపై 40 కేజీల బరువు రాయిని పెట్టుకొని వాకింగ్ చేసినట్లు వార్తలు వచ్చాయి. జిహ్వకో రుచి, పుర్రెకో బుద్ధి అనుకొని ఊరుకోవడం తప్పించి వినని మనుషులకు ఎవరు మాత్రం ఏం చెప్తారు?