ట్రంప్ కు గుడ్ బై: వ్యాపారవేత్తల సంచలన నిర్ణయం
ట్రంప్ కు గుడ్ బై: వ్యాపారవేత్తల సంచలన నిర్ణయం
Published Fri, Jun 2 2017 3:12 PM | Last Updated on Tue, Sep 5 2017 12:40 PM
కర్బన్ ఉద్గారాల విడుదలను నియంత్రించడానికి కుదుర్చుకున్న పారిస్ ఒప్పందం నుంచి అగ్రరాజ్యం అమెరికా వైదొలుగుతున్నట్టు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించడంతో, పెద్ద ఎత్తున్న నిరసనలు వ్యక్తమవుతున్నాయి. దేశాధినేతలు, బిజినెస్ లీడర్లు ట్రంప్ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. అమెరికాలోని అతిపెద్ద బిజినెస్ లీడర్లు టెస్లా వ్యవస్థాపకుడు ఎలోన్ మస్క్, డిస్నీ రాబర్ట్ ఇగెర్ లు ట్రంప్ బిజినెస్ అడ్వైజరీ ప్యానల్ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించారు. పారిస్ ఒప్పందం నుంచి ట్రంప్ వైదొలగితే తాను బిజినెస్ అడ్వయిజరీ ప్యానెల్ కు రాజీనామా చేస్తామని ఎలోన్ మస్క్ ముందుగానే హెచ్చరించారు. ''అధ్యక్షుడి కౌన్సిల్ నుంచి నేను వైదొలుగుతున్నాను. వాతావరణ మార్పు అనేది నిజం. పారిస్ ఒప్పందం నుంచి వైదొలగడం ఇటు అమెరికాకు అటు ప్రపంచానికి మంచిదికాదు'' అని ఎలోన్ మస్క్ ట్వీట్ చేశారు.
పారిస్ అగ్రిమెంట్ నుంచి తప్పుకోవడంతో తాను కూడా అధ్యక్షుడి కౌన్సిల్ కు రాజీనామా చేస్తున్నట్టు రాబర్ట్ ఇగెర్ ట్వీట్ చేశారు. ఇప్పటికే వలసవాదులు, శరణార్థులపై ట్రంప్ వివాదాస్పద నిర్ణయం తీసుకోవడంతో ఆయన కౌన్సిల్ నుంచి ప్రముఖ ట్యాక్సీ సంస్థ ఉబర్ సీఈఓ ట్రావిస్ కలానిక్ తప్పుకొన్నారు. తాజాగా టెస్లా వ్యవస్థాపకుడు, డీస్నీ అధినేతలు కూడా ట్రంప్ కు గుడ్ బై చెప్పారు. నేడు తీసుకున్న ఈ నిర్ణయం పర్యావరణానికి, ప్రపంచంలో ఆధిపత్య స్థానంలో ఉన్న అమెరికాకు భారీ ఎదురుదెబ్బ అని గోల్డ్ మాన్ సాచ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ లాయిడ్ బ్లాంక్ఫీన్ కూడా అన్నారు. ట్రంప్ నిర్ణయాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.. అధ్యక్షుడిగా ట్రంప్ ఎన్నికైన తర్వాత గతేడాది బిజినెస్ అడ్వైజరీ గ్రూప్ ను ఆయన ఏర్పాటుచేశారు.
Advertisement
Advertisement