గల్లంతైన వారి కోసం గాలింపు | Emergency workers find bodies in water near capsized South Korean ferry | Sakshi
Sakshi News home page

గల్లంతైన వారి కోసం గాలింపు

Published Fri, Apr 18 2014 5:13 AM | Last Updated on Sat, Sep 2 2017 6:09 AM

గల్లంతైన వారి కోసం గాలింపు

గల్లంతైన వారి కోసం గాలింపు

దక్షిణ కొరియా నౌక ప్రమాదంలో తొమ్మిదికి పెరిగిన మృతుల సంఖ్య  సహాయ సిబ్బందికి పలు ఆటంకాలు
  మోక్పొ (దక్షిణ కొరియా): దక్షిణ కొరియా తీరంలో సంభవించిన నౌక ప్రమాదంలో గల్లంతైన వారి జాడ కోసం సహాయక సిబ్బంది రెండో రోజు గురువారం కూడా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అయితే పసుపు సముద్రంలో బలమైన అంతర్గత ప్రవాహాలు, వర్షం, మసక వాతావరణం సహాయక సిబ్బందికి ఆటంకంగా నిలుస్తున్నాయి. దక్షిణ కొరియాలోని ఇంచియాన్ నుంచి జెజు దీవి మధ్య ప్రయాణించే ఓడ బుధవారం ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే.
 
 ఆ ఓడలో మొత్తం 475 మంది ప్రయాణికులు ఉండగా అందులో 325 మంది విద్యార్థులే. ఈ ప్రమాదంలో గురువారం నాటికి 9 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. మరో 287 మంది జాడ తెలియలేదు. ప్రమాదం జరిగి రెండు రోజులు గడుస్తున్న కారణంగా మరణాల సంఖ్య భారీగా పెరగవచ్చని అధికారులు ఆందోళన చెందుతున్నారు. గల్లంతైన వారిలో చాలా మంది నౌకలోనే చిక్కుకుని ఉండవచ్చని, ఒక వేళ ఎవరైనా నీటిలోకి దూకినా విపరీతమైన చల్లదనం వల్ల ఎక్కువసేపు బతికే అవకాశాలు లేవని వారు అంచనాకు వస్తున్నారు.
 
 కాగా, విద్యార్థుల తల్లిదండ్రులతో దేశాధ్యక్షురాలు పార్క్ గుయెన్ హైయి ఏర్పాటు చేసిన సమావేశం రసాభాసగా మారింది. ప్రమాదం జరిగి ఇంతసేపైనా ఏం చేస్తున్నారంటూ ప్రెసిడెంట్‌ను నిలదీశారు. అంతకుముందే ఆమె ప్రమాదస్థలిని సందర్శించారు.
 
 అమ్మా నువ్వంటే చాలా ఇష్టం..
 దేశాన్ని కుదిపేసిన ఈ ప్రమాదంలో చిక్కుకున్న విద్యార్థులు పంపిన మెసేజ్‌లు హృదయాలను ద్రవింపచేసేలా ఉన్నాయి. ఓడ క్రమక్రమంగా మునిగిపోతున్న సమయంలో.. ‘‘ అమ్మా నీకు మళ్లీ చెప్పగలనో లేదో, ఐ లవ్యూ’’ అని ఒక విద్యార్థి పంపిన సందేశం, ఓడ ప్రమాదం తెలియని ఆ తల్లి ‘‘ఐ లవ్యూ టూ’’ అని ప్రత్యుత్తరమిచ్చిన మెసేజ్‌లు టీవీల్లో చూస్తున్న ప్రజల కళ్లు చెమ్మగిల్లుతున్నాయి. ఇలాంటి సంక్షిప్త సందేశాలు చాలా మంది తమ వారికి పంపినవి ఒక్కొక్కటి బహిర్గతం అవుతుంటే దేశం అంతా తల్లడిల్లిపోతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement