'తప్పించుకోండి.. రహస్యంగా రాజధానికి చేరుకోండి'
'తప్పించుకోండి.. రహస్యంగా రాజధానికి చేరుకోండి'
Published Sat, Oct 29 2016 6:26 PM | Last Updated on Sat, Mar 23 2019 8:36 PM
''పోలీసులు అరెస్టు చేసేందుకు కాసుకుని కూర్చున్నారు.. వాళ్ల నుంచి ఎలాగోలా తప్పించుకోండి. రాజధాని ఇస్లామబాద్‌కు రహస్యంగా చేరుకోండి'' అని మాజీ క్రికెటర్, పాకిస్థాన్‌లోని తెహరీక్ ఎ ఇన్సాఫ్ పార్టీ నాయకుడు ఇమ్రాన్ ఖాన్ తన అనుచరులకు పిలుపునిచ్చారు. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన 600 మందిని పోలీసులు అరెస్టుచేశారు. ఈ నేపథ్యంలోనే ఎలాగైనా రాజధాని ఇస్లామాబాద్‌కు చేరుకుని, నవంబర్ రెండోతేదీన నిర్వహించే మహా ర్యాలీకి హాజరు కావాలని ఇమ్రాన్ తనవాళ్లకు పిలుపునిచ్చారు. నవాజ్ షరీఫ్ ప్రభుత్వానికి మన బలమేంటో చూపించాలని చెప్పారు. మెయిన్ రోడ్లలో కాకుండా.. రహస్య మార్గాల్లో పయనిస్తే చేరుకోవడం సులభం అవుతుందన్నారు. ఇంతకుముందు కూడా ఇమ్రాన్ ఖాన్ పార్టీ దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సభలు నిర్వహించి ప్రజలను ర్యాలీకి రప్పించడానికి వారిలో ఉత్సాహం నింపే ప్రయత్నం చేసింది.
ఈ పార్టీ కార్యకర్తలకు, పోలీసులకు మధ్య ఇస్లామాబాద్, రావల్పిండిలో ఘర్షణలు జరిగాయి. దాంతో పెషావర్ - ఇస్లామాబాద్ మార్గాన్ని, అటాక్ బ్రిడ్జిని పంజాబ్ పోలీసులు మూసేశారు. ఇమ్రాన్ మనుషులు మాత్రం ఎలాగైనా ఇస్లామాబాద్ చేరుకోవాలని విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రాంతంలో ఇమ్రాన్ పార్టీకి చెందిన ముఖ్యమంత్రి ఉన్నారు. ఆయనతో పాటు అసెంబ్లీ సభ్యులు ఎవరైనా ఇస్లామాబాద్ చేరుకునే ప్రయత్నం చేస్తే.. వాళ్లను కూడా సామాన్య పౌరుల్లాగే చూస్తాం తప్ప ఉపేక్షించేది లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. పనామా పేపర్లలో పేరు వెల్లడైన తర్వాత రాజీనామా చేయాలని నవాజ్ షరీఫ్‌ను ఇమ్రాన్ ఖాన్ డిమాండ్ చేశారు. ఇదెక్కడా ప్రజాస్వామ్యంలా లేదని, నవాజ్ నియంతృత్వం లాగే ఉందని ఆయన అన్నారు.
Advertisement
Advertisement