లండన్: మోదీ సర్కార్ తెచ్చిన పౌరసత్వ సవరణ చట్టం(సీఏఏ)కు వ్యతిరేకంగా యూరోపియన్ పార్లమెంట్లో చర్చకు రంగం సిద్ధమైంది. యూరోపియన్ పార్లమెంట్ సభ్యులు సీఏఏపై చర్చ కోరుతూ దాఖలు చేసిన ఐదు తీర్మానాలను కలిపి ఒకటిగా చేసి, బ్రసెల్స్‌లో జరుగుతున్న ప్లీనరీలో ప్రవేశపెట్టారు. ఈ అంశాన్ని బుధవారం సమావేశాల తుది ఎజెండాలో చేర్చారు. చర్చ అనంతరం గురువారం జరగాల్సిన ఓటింగ్‌ను వాయిదా వేశారు. ఓటింగ్ మార్చి నెలలో జరిగే సమావేశాల్లో నిర్వహిస్తామని యూరోపియన్ పార్లమెంట్ ప్రకటించింది. సీఏఏపై చర్చను మాత్రం ఇప్పుడు కొనసాగించి, ఓటింగ్‌ను మార్చికి వాయిదా వేయాలన్న సభ్యుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామంది.
భారత్ వ్యతిరేకత కారణంగానే ఓటింగ్ వాయిదా పడిందని, ఇది భారత ప్రభుత్వ దౌత్య విజయమని విశ్లేషకులు భావిస్తున్నారు. యూరోపియన్ పార్లమెంట్ తీరును భారత్ తీవ్రంగా గర్హించింది. ఒక రాజ్యాంగబద్ధసంస్థ చేసిన చట్టంపై మరో రాజ్యాంగబద్ధ సంస్థ తీర్పునివ్వడం సరికాదని లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడికి లేఖ రాశారు. యూరోపియన్ పార్లమెంట్లో పాకిస్తాన్ మిత్రుల వాదనపై భారత మిత్రుల వాదనే నెగ్గిందని భారత ప్రభుత్వ వర్గాలు వ్యాఖ్యానించాయి. సీఏఏ వివక్షాపూరితమని, ఆ చట్టంలోని వివాదాస్పద సవరణలను భారత్ వెనక్కు తీసుకోవాలని గత నెలలో ఐరాస మానవహక్కుల విభాగం ‘యూఎన్‌హెచ్‌సీఆర్’ చేసిన వ్యాఖ్యను ఈయూ పార్లమెంట్ పరిగణనలోకి తీసుకుంది.
బెగ్జిట్‌కు ఆమోదం
యూరోపియన్ యూనియన్‌తో బ్రిటన్ విడిపోయే బ్రెగ్జిట్ ఒప్పందానికి బుధవారం యూరోపియన్ పార్లమెంట్ ఆమోదం తెలిపింది.
అమెరికాలో..
సీఏఏ, ఎన్నార్సీలు అమెరికా ప్రతినిధులసభలో మరోమారు చర్చనీయాంశంగా మారాయి. సీఏఏ, ఎన్నార్సీలు మతపరమైన హింసకు సాక్ష్యంగా నిలుస్తున్నాయని అంతర్జాతీయ నిపుణులు విచారణ సందర్భంగా సభకు వివరించారు. అంతర్జాతీయ మానవహక్కుల ఉపసంఘాలూ, గ్లోబల్ హెల్త్ ఉపసంఘాలూ, సివిల్ రైట్స్, సివిల్ లిబర్టీస్‌సబ్ కమిటీలూ, ఆఫ్రికా విదేశాంగ వ్యవహారాల కమిటీలు ఈ విచారణను చేపట్టాయి.
Comments
Please login to add a commentAdd a comment