ప్రియమైన జాబిల్లి... | The First Traveler To The Moon | Sakshi
Sakshi News home page

ప్రియమైన జాబిల్లి...

Published Thu, Sep 20 2018 11:13 PM | Last Updated on Fri, Sep 21 2018 3:44 PM

The First Traveler To The Moon - Sakshi

జలజలా జారిపడుతన్న జలపాతాన్ని చూస్తే...మనలాంటోళ్లు..‘‘అబ్బా.. ఎంత బాగుందో’’ అనుకుంటాం. అదే జలధార...ఓ కవి కంట పడితే.. ఉర్రూతలూగించే కవిత పుట్టుకొస్తుంది.. చిత్రకారుడి కుంచె కదిలి పాలనురగల్లో సప్తవర్ణాలు విరబూస్తాయి! చిత్రదర్శకుడి కెమెరా కన్ను.... మరిన్ని కోణాలను ఆవిష్కరించేస్తాయి! మరి.. ఈ కళాకారులు అందరూ ఒక్కసారి జాబిల్లి అందాలను చూస్తే... ఎంత కవిత్వం వస్తుంది ? ఎంత భావుకత ఉట్టిపడుతుంది ? జపాన్‌ కోటీశ్వరుడు యుసాకూ మెజవాతోపాటు వీరందరూ జాబిల్లిని చుట్టేయనున్నారు మరి!

అమెరికాకు చెందిన ప్రైవేటు అంతరిక్ష సంస్థ స్పేస్‌ ఎక్స్‌ చంద్రుడిపైకి తొలిసారిగా టూరిస్టును పంపడానికి సన్నాహాలు చేస్తోంది. స్పేస్‌ ఎక్స్‌కి చెందిన బిగ్‌ ఫాల్కన్‌ రాకెట్‌ (బీఎఫ్‌ఆర్‌)లో 2023లో ఈ యాత్ర చేపట్టబోతోంది. జపాన్‌కు చెందిన బిలయనీర్‌ యుసాకూ మెజావా మొదటి స్పేస్‌ టూరిస్ట్‌గా రికార్డులకెక్కబోతున్నారు. అయిదు రోజుల పాటు జాబిల్లి అందాల్ని చూస్తూ గడపనున్నారు. చంద్రుడి చుట్టూ చక్కెర్లు కొడుతూ చుక్కలతో కబుర్లు చెబుతూ గొప్ప గొప్ప అనుభూతుల్ని మూటకట్టుకోనున్నారు. 

కళాకారుల సమేతంగా 
యూసకూ మెజవా ఆనందానికి ఇప్పుడు జాబిల్లే హద్దు. ఆయన ఈ యాత్రపై అత్యంత ఉత్సాహంగా ఉన్నారు. ప్రపంచం నలుమూలల నుంచి ఆరు నుంచి ఎనిమిది మంది కళాకారుల్ని వెంట తీసుకువెళ్లడానికి సన్నాహాలు చేస్తున్నారు. సినిమాలు, ఆర్కిటెక్చర్, పెయింటింగ్, ఫోటోగ్రఫీ, శిల్పాకళాకృతులు వంటి విభాగాల్లో రాణిస్తున్న వారిని తన వెంట తీసుకువెళతారు.  స్వయంగా రాక్‌ డ్రమ్మర్‌ అయిన మెజవా కళాకారులైతే చంద్రుడిపై అనుభూతుల్ని తిరిగి భూమికి వచ్చాక అందరికీ అందంగా పంచుతారని ఆశపడుతున్నారు. ఇందుకోసం ఎంత ఖర్చయినా వెనుకాడడం లేదు. కళాకారుల ఖర్చులు కూడా ఆయనే స్వయంగా భరిస్తారు. ఈ యాత్రకు ప్రియమైన జాబిల్లి అంటూ ప్రత్యేకంగా ఒక పేరు కూడా పెట్టేసుకున్నారు. 42 ఏళ్ల వయసున్న  యుసాకూ మెజవా జపాన్‌లో అత్యంత సంపన్నుల్లో 18వ ర్యాంకు పొందారు. ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌కు కూడా ఎక్కిన ఆయన ఆస్తిపాస్తుల విలువ 300 కోట్ల డాలర్ల పై మాటే.

మెజవా ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌ దిగ్గజం కూడా. స్టార్ట్‌ టుడే కంపెనీతో జపాన్‌ ఫ్యాషన్‌ రంగంలో ఆయన ఒక ఐకాన్‌గా నిలిచారు. మెజవా మొదట్లో టీ షర్ట్‌లు, సీడీల వ్యాపారం చేసేవారు. ఆ తర్వాత ఫ్యాషన్‌ రంగంలోకి అడుగు పెట్టి కోట్లకు పడగలెత్తారు. ఈ మధ్య కాలంలో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పెయింటింగ్‌లు సేకరణ మొదలు పెట్టారు. ఎక్కడ అరుదైన పెయింటింగ్‌ల వేలం జరిగినా అక్కడ మెజవా ప్రత్యక్షమైపోతారు. లక్షల డాలర్లు పోసి పెయింటింగ్‌లు కొనేస్తున్నారు. అలా అమెరికా కళాకారుడు జీన్‌ మైకేల్‌ బాస్క్విట్‌ వేసిన ఒక పెయింటింగ్‌కు ఆయన ఫిదా అయిపోయారు. ఆ పెయింటింగ్‌ చూసిన తర్వాతే అంతరిక్ష యాత్ర చేయాలన్న ఆలోచన కలిగింది. తనతో పాటు కొందరు కళాకారుల్ని కూడా తీసుకువెళ్లాలని నిర్ణయించుకున్నారు.  బాస్క్వట్‌ ఏమైనా చంద్రుడ్ని అత్యంత సమీపం నుంచి చూశారా ? లేదంటే అంతరిక్షం నుంచి భూమిని కానీ చూశారా ? అంత అద్భుతంగా పెయింటింగ్‌ వేయడం ఎలా సాధ్యమైందో అంటూ మెజవా ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. 

వాళ్ల శరీరాలు తట్టుకోగలవా ?
స్పేస్‌ ఎక్స్‌ సీఈవో ఎలన్‌ మస్క్‌  చంద్రుడిపైకి యుసాకూ మెజవా, ఆయనతోపాటు కొందరు కళాకారులు వెళతారని ప్రకటించిన దగ్గర్నుంచి అసలు వాళ్ల శరీరాలు ఈ ప్రయాణాన్ని తట్టుకోగలవా అన్న ప్రశ్నలే వినిపిస్తున్నాయి. వ్యోమగాములకైతే జీరో గ్రావిటీలో ఉండే శిక్షణ అదీ కఠోరంగా ఇస్తారు. శారీరకంగా, మానసికంగా బలంగా ఉన్నవారినే ఎంచుకుంటారు. మరి సామాన్యులు ఈ ప్రయాణాన్ని ఎంతవరకు తట్టుకోగలరు ? దీనిపై ఏరోస్పేస్‌ మెడిసన్‌ స్పెషలిస్టు డాక్టర్‌ పెట్రా ఇల్లిగ్‌ ఏమో ఏమైనా జరగొచ్చు అంటూ కొన్ని హెచ్చరికలు చేస్తున్నారు. అంతరిక్షంలోకి మొదటి సారి వెళ్లే వ్యక్తిపై తీవ్రమైన మానసిక ఒత్తిడి ఉంటుంది. భావోద్వేగాలు కూడా తీవ్రస్థాయిలో ఉంటాయి. ఇక కడుపులో వికారం, వాంతులు దగ్గర్నుంచి గుండెపోటువరకు ఏమైనా రావొచ్చు. అయితే మెజావా కళాకారుల బృందం వెళ్లేది నాలుగైదు రోజులే కాబట్టి పెద్దగా ప్రమాదం ఏమీ ఉండదని పెట్రా చెబుతున్నారు. దీర్ఘకాలం స్పేస్‌లో ఉండాల్సి వస్తే మాత్రం మైక్రోగ్రావిటీలో ఉన్న సమయంలో కండరాల పటుత్వం తగ్గిపోవడం, ఎముకల బలహీనంగా మారిపోవడం వంటివి జరుగుతాయి. 

టేకాఫ్‌ నుంచే ఆరోగ్య సమస్యలు 
వాస్తవానికి ప్రయాణికులకు సమస్యలు రాకెట్‌ టేకాఫ్‌ అయిన దగ్గర్నుంచి మొదలవుతాయి. చంద్రుడిపైకివెళ్లే క్రమంలో మన శరారానికి అలవాటైన గురుత్వాకర్షణ శక్తికి మూడు రెట్లు ఎక్కువ ఉంటుంది. దీని వల్ల గుండెపై ఒత్తిడి పడే అవకాశం ఉంది. అంతరిక్ష యాత్ర మొదలు పెట్టడానికి ముందే వారి ఆరోగ్య పరిస్థితి ఎలా ఉందో పూర్తిగా పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంది. ఒక్కసారి భూకక్ష్య దాటిపోయాక బరువు తగ్గిపోవడం అన్నది సమస్యగా ఉంటుంది. చంద్రుడిపైకి వెళితే మన శరీరం ఒక్కసారిగా బరువుని కోల్పోయినట్టుగా అనిపిస్తుంది. దీనివల్ల విరోచనాలు పట్టుకునే అవకాశాలు ఉంటాయి. ఇక అంతరిక్షంలోకి వెళ్లాక కడుపులో వికారం అన్నది సర్వసాధారణం.

అది సర్దుకోవడానికి కొద్ది రోజులు పడుతుంది. చంద్రుడిపైకి ఈ యాత్ర నాలుగైదు రోజులే ఉంటుంది కాబట్టి ఉన్నన్ని రోజులు వాళ్లందరికీ కడుపులో వికారం, వాంతి వచ్చినట్టుగా అనిపించడం అనే సమస్యలు వెంటాడే అవకాశం ఉంది. ఇక ఖగోళ రేడియో ధార్మికత అన్నది మరో సమస్య.  బిగ్‌ ఫాల్కన్‌ రాకెట్‌ చంద్రుడి చుట్టూ చక్కెర్లు కొడుతుంది కాబట్టి ఈ రేడియేషన్‌ వారిని ఎక్కువగా బాధించే అవకాశాలున్నాయి. అన్నింటికంటే ప్రధానమైనది మానసిక ఒత్తిడి. ఒక్కసారి స్పేస్‌ షిప్‌లోకి ప్రవేశించాక ఎలాంటి సాంకేతికపరమైన ఇబ్బందులైనా రావొచ్చు. ఎలాంటి అత్యవసర పరిస్థితులైనా ఎదురు కావచ్చు. ఎలాంటి పరిస్థితినైనా తట్టుకునే మానసిక బలం చాలా ముఖ్యం. అయితే ఇందుకోసం వారందరికీ తగిన శిక్షణ ఇస్తామని ఎలన్‌ మస్క్‌ చెబుతున్నారు. స్పేస్‌ టూరిస్టులందరికీ తగినంత శిక్షణ ఇచ్చాకే చంద్రుడిపైకి యాత్ర ప్రారంభిస్తామని ఆయన వివరించారు. 

జపాన్‌ ఫ్యాషన్‌ ఐకాన్‌ మెజావా..
42 ఏళ్ల వయసున్న యుసాకు మెజావా జపాన్‌లో అత్యంత సంపన్నుల్లో 18వ ర్యాంకు పొందారు. ఫోర్బ్స్‌ మ్యాగజైన్‌కు కూడా ఎక్కిన ఆయన ఆస్తిపాస్తుల విలువ 300 కోట్ల డాలర్ల పై మాటే. మెజావా ఆన్‌లైన్‌ ఫ్యాషన్‌ దిగ్గజం కూడా. స్టార్ట్‌ టుడే కంపెనీతో జపాన్‌ ఫ్యాషన్‌ రంగంలో ఆయన ఒక ఐకాన్‌గా నిలిచారు. మెజావా మొదట్లో టీ షర్ట్‌లు, సీడీల వ్యాపారం చేసేవారు. ఆ తర్వాత ఫ్యాషన్‌ రంగంలోకి అడుగు పెట్టి కోట్లకు పడగలెత్తారు.


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement