న్యూ ఇయర్ కు మారణహోమానికి కుట్ర
ఢాకా: నూతన సంవత్సరం వేళ ఐదుగురు అనుమానిత ఉగ్రవాదులను బంగ్లాదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. కొత్త సంవత్సర వేడుకల్లో ప్రజలు తలమునకలై ఉండగా మారణహోమం సృష్టించేందుకు వీరు కుట్ర చేసినట్లు తమకు సమాచారం అందినట్లు బంగ్లా పోలీసులు చెప్పారు. వీరంతా కూడా జమాత్ ఉల్ ముజాహిదీన్ బంగ్లాదేశ్(జేఎంబీ) సంస్థకు చెందినవారుగా పోలీసులు భావిస్తున్నారు. ఇది ఒక నిషేధిత సంస్థ. ఇస్లామిక్ స్టేట్ తో కూడా దీనికి సంబంధాలు ఉన్నాయని సమాచారం. గతంలో జూలై 22న బంగ్లాలోని కేఫ్ దాడిలో జరిగిన మారణహోమానికి జేఎంబీనే కారణం అని పోలీసులు నిర్ధారించారు కూడా.
కొత్త సంవత్సర వేడుకల నేపథ్యంలో అనుమానిత ప్రాంతాల్లో గత రాత్రి తనిఖీలు నిర్వహించిన పోలీసులకు ఈ ఐదుగురు వ్యక్తులు అనుమానంగా కనిపించడంతోపాటు అడిగిన ప్రశ్నలకు సంబంధం లేని సమాధానాలు చెప్పారు. మరిన్ని తనిఖీలు నిర్వహించగా వారి వద్ద 60 కేజీల పేలుడు పదార్థాలు లభించాయి. దీంతో వారిని అరెస్టు చేసిన పోలీసులు జైలుకు తరలించారు. ఇప్పటికే ఢాకాలో 31, జనవరి 1 తేదీల్లో పెద్ద మొత్తంలో ఒకచోట చేరి పార్టీలు నిర్వహించుకోకుండా నిషేధం విధించింది.