టోక్యో, జపాన్ : నాలుగు ద్వీపాల సమూహ దేశం జపాన్‌ను వరద, భూపాతాలు, భూకంపం వణికించాయి. జపాన్ వ్యాప్తంగా కురిసిన భారీ వర్షాలకు 46 మంది మృతి చెందగా, 50 మంది ఆచూకీ ఇంకా తెలియరాలేదు. మృతుల సంఖ్య భారీగా పెరిగా అవకాశం ఉన్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. దాదాపు 100 సెంటీమీటర్లకు పైగా కురిసిన భారీ వర్షం కారణంగా పలుచోట్ల మెరుపు వరద సంభవించింది.
లోతట్టు ప్రాంతాల్లో దాదాపు 5 మీటర్ల మేర నీరు నిల్చొంది. దీంతో రెస్క్యూ టీమ్‌ల సాయం కోసం ఆయా ప్రాంతాల వారు ఇళ్లపైకి ఎక్కారు. పరిస్థితి దారుణంగా ఉందని జపాన్ ప్రధాని షింజో అబే అన్నారు. పరిస్థితులను చక్కదిద్దేందుకు అవసరమైన చర్యలను చేపట్టాలని మంత్రి వర్గాన్ని ఆదేశించారు.
హిరోషిమా, ఎహైమ్, ఒకయామా, క్యోటో తదితర ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా వర్షం కురుస్తుండటం వల్ల రక్షణ చర్యలకు ఆటంకం ఏర్పడింది. పశ్చిమ జపాన్‌లోని 32 లక్షల మందిని ఇళ్లు వదిలి సురక్షిత ప్రాంతాలకు తరలిపోవాలని ప్రభుత్వం సూచించింది. మరోవైపు వర్షం ధాటికి కొండచరియలు విరిగిపడి పెను ప్రమాదాలు జరిగాయి.
మెట్రో రైలు పట్టాలు తప్పిన ఫొటో జపాన పరిస్థితికి అద్దం పడుతోంది. మూలిగే నక్కపై తాటికాయ పడినట్లు అసలే మెరుపు వరదలు, భూ పాతాల ధాటికి కుదేలవుతున్న జపాన్‌పై శనివారం సాయంత్రం భూ కంపం విరుచుకుపడింది. రిక్టర్ స్కేలుపై భూ కంప తీవ్రత 6.0గా నమోదైంది.
Comments
Please login to add a commentAdd a comment