ఒక మీటరు ప్రజాస్వామ్యం కోసం...
ఇనుపబూట్ల సంకెళ్లలో ఇసుమంతైనా స్వేచ్ఛలేని రాజ్యం అది... కమ్యూనిస్టు చైనాలో వ్యక్తి వేసే ప్రతి అడుగుకు ప్రతిబంధకాలే... ‘గ్రేట్‌వాల్’ వెనుక సమాధి అవుతున్న ప్రజాస్వామాన్ని నిద్రలేపేందుకు ఓ కళాకారుడు సాహసమే చేశాడు.. 47 ఏళ్ల యున్‌చాంగ్.. చైనాకు చెందిన సినీ ఆర్టిస్ట్.. స్టేజ్ ప్రదర్శనలిస్తూ పేరు తెచ్చుకున్నాడు... అయితే చైనాలో వ్యక్తులపై విధించే ఆంక్షలు అతడికి భావప్రకటన స్వేచ్ఛను హేళన చేస్తున్నట్లు... ప్రజాస్వామాన్ని అపహాస్యం చేస్తున్నట్లుగా కనిపించాయి. అందుకే ‘రాజ్యం’ చేస్తున్న ఈ అరాచకాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పెద్ద సాహసాన్నే చేయాలని నిశ్చయించుకున్నాడు. అందులో భాగంగా తనకు తానే ఆపరేషన్ చేసుకున్నాడు... అది కూడా ఆపరేషన్ థియేటర్‌లో వీడియో ముందు.. ఒక డాక్టర్ పర్యవేక్షిస్తుండగా... మత్తుమందు తీసుకోకుండా.. మెడ కింది నుంచి తొడభాగం వరకు మీటరు పొడుగుతో గాటుపెట్టుకొని పక్కటెముకలను స్వయంగా తొలగించుకున్నాడు.
అంతటితో ఆగకుండా ఆ ఎముకలను మెడలో వేసుకొని మణిహారంగా ధరించాడు. తన భావప్రకటన స్వేచ్ఛకోసమే ఇదంతా చేశానని చెప్పాడు. ఈ ‘శారీరక’సాహస కృత్యాన్ని చైనా స్వేచ్ఛాపిపాసి ఒకరు ‘వన్ మీటర్ డెమోక్రసీ’( ఒక మీటరు ప్రజాస్వామ్యం)గా అభివర్ణించాడు. ఈ ఆపరేషన్ కంటే ముందు యున్‌చాంగ్ సాహసంపై ప్రజల అభిప్రాయాలను కోరితే 12 మంది అతడు విజయం సాధిస్తాడని అనుకూలంగా ఓటేస్తే... 10 మంది ఓడిపోతారంటూ హేళన చేశారు. తన సాహస కృత్యం ‘చైనాకు, చైనీయులకు మధ్య జరుగుతున్న భావసంఘర్షణకు’ ప్రతిబింబం లాంటిదని యుంగ్‌చాన్ అభివర్ణించాడు. ‘చైనా సమాజం చాలా సంక్షిష్టమైనదని భావిస్తున్నా... మన శరీరాన్ని, తెలివిని మనకు నచ్చినట్లు ఉపయోగించుకోవడానికి ఇక్కడ (చైనా) వాస్తవాన్ని ఎదుర్కోవాలి’అని పేర్కొన్నాడు.