అట్టుడుకుతోన్న ఫ్రాన్స్..
పారిస్: ఒకవైపు టీచర్లు, ఇంకోవైపు ట్యాక్సీ డ్రైవర్లు, మరోవైపు విమానాశ్రయ ఉద్యోగులు కలిసికట్టుగా చేస్తోన్న ఆందోళనలతో ఫ్రాన్స్ అట్టుడికిపోతోంది. ఆయా వర్గాలు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునివ్వడంతో మంగళవారం జనజీవనం అతలాకుతలమైంది. ట్యాక్సీ డ్రైవర్లు నిర్వహించిన నిరసన ప్రదర్శన చివరికి హింసకు దారితీసింది. ఎయిర్ ట్రాఫిక్ ఉద్యోగులు విధులకు దూరంగా ఉండటంతో పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. ఇతర ప్రభుత్వ ఉద్యోగులుకూడా ఈ సమ్మెకు మద్దతు పలకడంతో పరిస్థితి మరింత దిగజారింది.
విద్యారంగంలో వ్యవస్థాగత లోపాలను సవరించాలనే డిమాండ్ తో ఉపాధ్యాయులు సమ్మెకు దిగడంతో మంగళవారం పారిస్ లోని స్కూళ్లన్నీ మూతపడ్డాయి. యాప్ ఆధారిత అమెరికన్ క్యాబ్ సర్వీస్ ఉబెర్ సంస్థకు వ్యతిరేకంగా ట్యాక్సీ డ్రైవర్లు ఆందోళనబాటపట్టారు. 'యూఎస్ ఉబెర్.. గో హోమ్' అంటూ డ్రైవర్లు ప్లకార్డులు ప్రదర్శించారు. ఉద్యోగ సంబంధిత హక్కుల కోసం ఎయిర్ పోర్టులో పనిచేసే ఎయిర్ ట్రాఫిక్ సిబ్బంది నిరసనలకు దిగారు. ఈ మూడు రంగాలకు చెందిన యూనియన్ల నాయకులు మూకుమ్మడిగా దేశవ్యాప్త సమ్మెకు దిగారు. అధ్యక్షుడు ఫ్రాన్సిస్కో హోలాండే నేతృత్వంలోని సోషలిస్టు సర్కారు తమ హక్కులను హరిస్తోందంటూ నినదించారు.
వందలమంది ట్యాక్సీ డ్రైవర్లు ప్యారిస్ నగరంలోని పోర్ట్ మెయిల్టన్ నుంచి ఎనిమిది లేన్ల బైపాస్ రోడ్డు వరకు నిర్వహించతలపెట్టిన మార్చ్ ఉద్రిక్తతలకు దారితీసింది. హైవే పైకి వెళ్లనీయకుండా డ్రైవర్లను అడ్డుకునే క్రమంలో పోలీసులు వాటర్ కెనాన్లు, టియర్ గ్యాస్ షెల్స్ ను ప్రయోగించారు. పోలీసుల చర్యకు ఆగ్రహోదగ్రులైన ట్యాక్సీ డ్రైవర్లు వాహనాలకు నిప్పుపెట్టారు. దీంతో ఆ ప్రాంతమంతా కాసేపు నల్లటి పొగతో నిండిపోయింది.
ఓర్లే ఎయిర్ పోర్టు వద్ద జరిగిన ఆందోళనల్లోనూ ఒక ట్యాక్సీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. బస్సును అడ్డుకునే క్రమంలో గాయపడ్డ అతడిని సహచరులు ఆసుపత్రిలో చేర్చారు. ఎయిర్ ట్రాఫిక్ సిబ్బంది సమ్మెతో పారిస్ విమానాశ్రయంలో విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. నాలుగు సర్వీసులను రద్దుచేసిన అధికారులు మరికొన్ని సర్వీసులను దారిమళ్లించారు. ఫ్రాన్స్ ట్యాక్సీ డ్రైవర్లకు మద్దతుగా పొరుగుదేశాలైన బెల్జియం, స్పెయిన్ కు చెందిన డ్రైవర్లు కూడా ఆందోళనల్లో పాల్గొనడం గమనార్హం. గణతంత్ర్యవేడుకల్లో ముఖ్యఅతిథిగా పాల్గొనేందుకు ప్రాన్స్ అధ్యక్షుడు హోలాండే భారతకు వచ్చిన సంగతి తెలిసిందే.