భగత్‌ సింగ్‌ కోసం.. పాక్‌ లాయర్‌ పోరాటం | Fresh Plea Filed In Pak Court Over Bhagat Singh's Case | Sakshi
Sakshi News home page

భగత్‌ సింగ్‌ కోసం.. పాక్‌ లాయర్‌ పోరాటం

Published Wed, Sep 13 2017 9:21 PM | Last Updated on Tue, Sep 19 2017 4:30 PM

భగత్‌ సింగ్‌ కోసం.. పాక్‌ లాయర్‌ పోరాటం

భగత్‌ సింగ్‌ కోసం.. పాక్‌ లాయర్‌ పోరాటం

లాహోర్‌: భారతీయుల గుండెల్లో చిరకాలం నిలిచిపోయే స్వాతంత్ర్య సమరయోధుల్లో భగత్ సింగ్ ఒకరు. పోలీస్ అధికారి శాండర్స్‌ను కాల్చి చంపాడనే ఆరోపణలతో నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ను 23 ఏళ్ల ప్రాయంలో ఉరి తీసింది. ఈ శిక్ష అమలైన 86 ఏళ్ల తర్వాత.. భగత్ సింగ్ నిర్దోషి అంటూ ఓ పాకిస్థానీ లాయర్ లాహోర్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. భగత్ సింగ్ మెమోరియల్ ఫౌండేషన్‌ను నడుపుతున్న ఇంతియాజ్ రషీద్ ఖురేషీ అనే న్యాయవాది సెప్టెంబర్ 11న లాహోర్ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు.

సైమన్ కమిషన్ రాకను వ్యతిరేకిస్తూ.. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు లాలా లజపతిరాయ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో పోలీసులు లాఠీలతో కొట్టడంతో భగత్ సింగ్ కళ్ల ముందే లజపతిరాయ్ ప్రాణాలు వదిలారు. దీంతో లాలా లజపతిరాయ్ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని భగత్ సింగ్ భావించారు. సుఖ్‌దేవ్, రాజ్‌గురులతో కలిసి పోలీస్ అధికారి శాండర్స్‌ను కాల్చి చంపారు. ప్రభుత్వ వ్యతిరేక కుట్ర ఆరోపణలతో సింగ్‌పై కేసు నమోదు చేసిన బ్రిటీష్ ప్రభుత్వం 1931 మార్చి 23న ఆయన్ను ఉరి తీసింది.

1928లో శాండర్స్ హత్యకు గురి కాగా.. అదే ఏడాది డిసెంబర్ 17న ఎఫ్ఐఆర్ నమోదైంది. అనార్కలీ పోలీస్ స్టేషన్‌‌లో ఈ కేసుకు సంబంధించిన ఎఫ్‌ఐఆర్ కాపీలను లాహోర్ పోలీసులు 2014లో గుర్తించారు. ఉర్దూలో రాసిన ఆ ఎఫ్ఐఆర్ కాపీలను ఖురేషీ సంపాదించారు. సాయుధులైన గుర్తు తెలియని వ్యక్తి శాండర్స్‌ను హత్య చేసినట్లు ఆ ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారు. భగత్ సింగ్ పేరును అందులో ప్రస్తావించలేదు. 450 మంది సాక్షులను విచారించకుండానే, ఎఫ్‌ఐఆర్‌లో పేరు లేనప్పటికీ.. నాటి ధర్మాసనం భగత్ సింగ్‌కు ఉరి శిక్ష విధించిందని ఖురేషీ తెలిపారు. ఈ కేసులో భగత్ సింగ్ తరఫు న్యాయవాదుల వాదనలు వినలేదని ఆయన ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement