imtiaz rashid qureshi
-
భగత్ సింగ్ కోసం.. పాక్ లాయర్ పోరాటం
లాహోర్: భారతీయుల గుండెల్లో చిరకాలం నిలిచిపోయే స్వాతంత్ర్య సమరయోధుల్లో భగత్ సింగ్ ఒకరు. పోలీస్ అధికారి శాండర్స్‌ను కాల్చి చంపాడనే ఆరోపణలతో నాటి బ్రిటిష్ ప్రభుత్వం ఆయన్ను 23 ఏళ్ల ప్రాయంలో ఉరి తీసింది. ఈ శిక్ష అమలైన 86 ఏళ్ల తర్వాత.. భగత్ సింగ్ నిర్దోషి అంటూ ఓ పాకిస్థానీ లాయర్ లాహోర్ కోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. భగత్ సింగ్ మెమోరియల్ ఫౌండేషన్‌ను నడుపుతున్న ఇంతియాజ్ రషీద్ ఖురేషీ అనే న్యాయవాది సెప్టెంబర్ 11న లాహోర్ హైకోర్టులో ఈ పిటిషన్ దాఖలు చేశారు. సైమన్ కమిషన్ రాకను వ్యతిరేకిస్తూ.. ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు లాలా లజపతిరాయ్ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆ సమయంలో పోలీసులు లాఠీలతో కొట్టడంతో భగత్ సింగ్ కళ్ల ముందే లజపతిరాయ్ ప్రాణాలు వదిలారు. దీంతో లాలా లజపతిరాయ్ హత్యకు ప్రతీకారం తీర్చుకోవాలని భగత్ సింగ్ భావించారు. సుఖ్‌దేవ్, రాజ్‌గురులతో కలిసి పోలీస్ అధికారి శాండర్స్‌ను కాల్చి చంపారు. ప్రభుత్వ వ్యతిరేక కుట్ర ఆరోపణలతో సింగ్‌పై కేసు నమోదు చేసిన బ్రిటీష్ ప్రభుత్వం 1931 మార్చి 23న ఆయన్ను ఉరి తీసింది. 1928లో శాండర్స్ హత్యకు గురి కాగా.. అదే ఏడాది డిసెంబర్ 17న ఎఫ్ఐఆర్ నమోదైంది. అనార్కలీ పోలీస్ స్టేషన్లో ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీలను లాహోర్ పోలీసులు 2014లో గుర్తించారు. ఉర్దూలో రాసిన ఆ ఎఫ్ఐఆర్ కాపీలను ఖురేషీ సంపాదించారు. సాయుధులైన గుర్తు తెలియని వ్యక్తి శాండర్స్‌ను హత్య చేసినట్లు ఆ ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. భగత్ సింగ్ పేరును అందులో ప్రస్తావించలేదు. 450 మంది సాక్షులను విచారించకుండానే, ఎఫ్ఐఆర్లో పేరు లేనప్పటికీ.. నాటి ధర్మాసనం భగత్ సింగ్‌కు ఉరి శిక్ష విధించిందని ఖురేషీ తెలిపారు. ఈ కేసులో భగత్ సింగ్ తరఫు న్యాయవాదుల వాదనలు వినలేదని ఆయన ఆరోపించారు. -
పాక్‌పై బాంబు పేల్చిన ఆ దేశ మాజీ రక్షణ మంత్రి
న్యూఢిల్లీ: పాకిస్ధాన్ మరోఇరకాటంలో పడింది. ఆ దేశానికి చెందిన మాజీ రక్షణ శాఖమంత్రి ఓ భారతీయ చానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాంబు పేల్చారు. అల్ ఖాయిదా చీఫ్ ఒసామా బిన్ లాడెన్ గురించి పాకిస్థాన్‌కు ముందే తెలుసని, తమ దేశమే అతడికి ఆశ్రయం కూడా ఇచ్చిందని పాకిస్థాన్ మాజీ రక్షణ శాఖమంత్రి చౌదరీ అహ్మద్ ముక్తార్ చెప్పారు. అహ్మద్ వ్యాఖ్యలు తెలుసుకున్న పాకిస్థాన్ మాజీ ఆర్మీ చీఫ్ డైరెక్టర్ జనరల్ పర్వేశ్ ముషార్రప్, రషీద్ ఖురేషి తీవ్రంగా ఖండించారు. అహ్మద్ ఒక అబద్ధాలకోరు అని, ఆయన చెప్పేవన్నీ అసత్యాలని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటి వరకు అసలు తమ దేశంలో ఒసామా బిన్ లాడెన్ ఉన్నట్లు తమకు తెలియనే తెలియదని, తమకు తెలియకుండానే అమెరికా అబోటాబాద్‌లోని లాడెన్ నివాసంపై దాడులు చేసి హతమార్చిందని పాకిస్థాన్ ప్రపంచాన్ని నమ్ముతూ వచ్చింది. ఈ నేపథ్యంలో మాజీ రక్షణశాఖ మంత్రి స్వయంగా పాకిస్థాన్‌కు అంతా తెలుసని వ్యాఖ్యలు చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. 'అహ్మద్ ముక్తార్ ఇలాంటి మాటలను అన్నారంటే నేను నమ్మలేకపోతున్నాను. ఒక వేళ ఆయన నిజంగా ఈ మాటలు అంటే ముక్తార్‌కు ఏదో అయి ఉంటుంది. ముక్తార్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం మొత్తం పాకిస్థాన్‌ను షాక్‌కు గురిచేసింది. అయితే, పాక్ అధ్యక్షుడికి నాటి లాడెన్ గురించి ముందే తెలుసు అని అన్నట్లు నేను మాత్రం విన లేదు' అని రషీద్ ఖురేషి అన్నారు. 2008 నుంచి 2012 మధ్య కాలంలో అహ్మద్ ముక్తార్ పాక్ రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు. నాటి ప్రధాని యూసఫ్ రజా గిలానీ కేబినెట్లో ఉన్న ఐదుగురు మంత్రుల్లో ముక్తార్ కూడా ఒకరు. లాడెన్ చనిపోయిన దాదాపు నాలుగన్నరేళ్ల తర్వాత తొలిసారి పాకిస్థాన్ ఇప్పటి వరకు అబద్ధాలతో ప్రపంచాన్ని నమ్మించిందని ముక్తార్ వ్యాఖ్యలతో అర్థమైందని సర్వత్రా చర్చించుకుంటున్నారు.