ఏదైనా సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాకు స్నేహితులతో కలసి వెళ్లామనుకోండి. అందులో ఎవరో ఒకరు ఆ సినిమాను ముందే చూసి ఉంటారు. ముందు చూడటంలో తప్పు లేదు కానీ కొందరు మాత్రం ఆ సినిమాలోని సీన్ రాకముందే ‘ఇలా జరుగుతుంది... ఇలా జరుగుతుంది’ అంటూ అన్నీ చెప్పేస్తుంటారు. అప్పుడు భలే చిరాకేస్తుంది కదా.. మరీ కోపం వస్తే కొట్టాలని కూడా అనిపిస్తుంటుంది. అచ్చు మీలాగే రష్యాకు చెందిన ఓ పెద్దాయనకు కూడా కోపం వచ్చింది. ఎందుకో తెలుసా తాను చదివే పుస్తకాల్లోని క్లైమాక్స్‌ను ముందే చెప్పేస్తున్నాడనే కోపంతో తన సహోద్యోగిని ఏకంగా కత్తితో పొడిచేశాడట. రష్యాకు చెందిన 55 ఏళ్ల సెర్గెయ్ సవిస్కీ అనే శాస్త్రవేత్తకు పుస్తకాలు చదవడం అలవాటు. ఆయనతో పాటు 52 ఏళ్ల ఒలెజ్ బెలెగుజోవ్ నాలుగేళ్లుగా పనిచేస్తున్నారు.
ఒలెజ్‌కు కూడా పుస్తకాలు చదవడం అంటే మహా పిచ్చి. టైం పాస్ అయ్యేందుకు ఇద్దరూ వందల కొద్దీ పుస్తకాలు చదివారు. చదువుతూ ఉన్నారు. సెర్గెయ్ చదివే పుస్తకాల్లోని కథ ముగింపును సరదాగా ఒలెజ్ ముందే చెప్పేస్తూ ఆయనను ఆట పట్టిస్తుండే వాడు. అయితే ఇది సెర్గెయ్‌కు నచ్చలేదు. పుస్తకంలోని థ్రిల్‌ను కోల్పోతున్నానని ఫీల్ అయ్యేవాడు. అంతే... కోపం పట్టలేక ఓ రోజు ఒలెజ్‌ను సెర్గెయ్ ఏకంగా కిచెన్‌లోని చాకుతో ఛాతీలో పొడిచాడు. అయితే వెంటనే ఒలెజ్‌ను హాస్పిటల్‌కు తీసుకెళ్లడంతో ప్రాణాపాయం తప్పిందనుకోండి. మీరు కూడా సినిమా చూసేటప్పుడు వచ్చే సీన్లను చెప్పేటప్పుడు కాస్త జాగ్రత్త సుమా!
Comments
Please login to add a commentAdd a comment