అది మా న్యాయమైన హక్కు
* భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వంపై జీ-4 దేశాల ప్రకటన
* భారత్, జపాన్, జర్మనీ, బ్రెజిల్ శిఖరాగ్ర సమావేశం
* మెర్కెల్, షింజో, దిల్మాలతో జీ-4 భేటీ నిర్వహించిన మోదీ
* మరింత విశ్వసనీయత కోసం మరిన్ని దేశాలకు చోటివ్వాలి
* మా అభ్యర్థిత్వాలకు పరస్పరం మద్దతు ప్రకటిస్తున్నాం
* భేటీ అనంతరం సంయుక్త ప్రకటనలో జీ-4 ఉద్ఘాటన
ఐక్యరాజ్యసమితి భద్రతామండలికి మరింత విశ్వసనీయత, న్యాయబద్ధత ఉండాలంటే ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యాలను, ఆర్థిక వ్యవస్థలో ప్రధాన చోదక శక్తులు, ఖండాలన్నింటి నుంచి గళాలను అందులో చేర్చాలి. ప్రపంచ బాధ్యతలను చేపట్టేందుకు భారత్, బ్రెజిల్, జర్మనీ, జపాన్ సిద్ధం
- ప్రధాని మోదీ
న్యూయార్క్: ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో శాశ్వత సభ్యత్వానికి తాము న్యాయమైన అభ్యర్థులమని భారత్, జపాన్, జర్మనీ, బ్రెజిల్‌లు ప్రకటించాయి. మండలి సంస్కరణలను నిర్ణీత కాలావధిలో చేపట్టాలని పేర్కొన్నాయి. ఈ పనిని తక్షణమే పూర్తిచేయాలని భారత ప్రధాని నరేంద్రమోదీ ఉద్ఘాటించారు. ఆయన శనివారం న్యూయార్క్‌లో జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్, జపాన్ ప్రధానమంత్రి షింజో అబె, బ్రెజిల్ అధ్యక్షురాలు దిల్మా రౌసెఫ్‌లతో జీ-4 (గ్రూప్-4) కూటమి శిఖరాగ్ర సదస్సును నిర్వహించారు. 2004 తర్వాత జరుగుతున్న మొదటి సదస్సులో ఆయన మాట్లాడుతూ.. ఐక్యరాజ్యసమితి భద్రతామండలికి మరింత విశ్వసనీయత, న్యాయబద్ధత ఉండాలంటే.. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్యాలను, ప్రపంచ ఆర్థికవ్యవస్థలో ప్రధాన చోదకశక్తులను, ప్రధానమైన ఖండాలన్నిటి నుంచి గళాలను అందులో చేర్చాలని పేర్కొన్నారు. ఈ నాలుగు దేశాలు ప్రపంచ బాధ్యతలను చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నాయన్నారు. ఈ ప్రపంచ సంస్థ గతించిపోయిన శతాబ్దపు ఆలోచనా రీతిని ప్రతిఫలిస్తోందని.. ఉగ్రవాదం, వాతావరణ మార్పు వంటి కొత్త ఆందోళనలకు అనుగుణంగా లేదని చెప్పారు. దశాబ్దాల ఆకాంక్షల మేరకు సమితి ఇటీవల సంస్కరణలపై చర్చలు ప్రారంభించేందుకు గణనీయమైన చర్యలు చేపట్టిందని.. దీనిని ప్రస్తుత 70వ సమావేశంలోనే హేతుబద్ధ ముగింపుకు తీసుకువెళ్లాలని పేర్కొన్నారు.
అనంతరం.. జీ-4 దేశాధినేతలు సంయుక్త ప్రకటన విడుదల చేస్తూ.. ఇటీవలి సంవత్సరాల్లో పెరిగిపోయిన ప్రపంచ సంఘర్షణలు, సంక్షోభాలను పరిష్కరించేందుకు మరింత ప్రాతినిధ్యపూరిత, న్యాయబద్ధమైన, సమర్థమంతమైన భద్రతామండలి అవసరం ఇప్పుడు చాలా అధికంగా ఉందని ఉద్ఘాటించాయి. భద్రతామండలిలో సంస్కరణలు తెచ్చేందుకు ఐక్యరాజ్యసమితిలో కొనసాగుతున్న ప్రక్రియను.. వాటి అత్యవసరతను దృష్టిలో పెట్టుకుని నిర్దిష్ట కాలావధిలో నిర్వహించాలని బలంగా పేర్కొన్నాయి. విస్తరించిన, సంస్కరించిన మండలిలో శాశ్వత సభ్యత్వానికి తమ జీ-4 దేశాలు న్యాయమైన అభ్యర్థులని పేర్కొంటూ.. తమ అభ్యర్థిత్వాలకు పరస్పరం మద్దతునిస్తున్నట్లు తెలిపాయి.
సమితిని సంస్కరించే కృషిలో భాగంగా భద్రతామండలిని త్వరగా సంస్కరించాలంటూ అన్ని దేశాల, ప్రభుత్వాల అధినేతలు 2005 ప్రపంచ సదస్సులో ఏకగ్రీవంగా మద్దతు తెలిపినప్పటి నుంచీ.. ఆ దిశగా గణనీయమైన పురోగతి ఏదీ సాధించలేదని జీ-4 పేర్కొంది. సమితి 70వ సర్వసభ్య సమావేశంలో నిర్దిష్ట ఫలితం వచ్చేలా చూసేందుకు తమ ప్రయత్నాలను రెట్టింపు చేస్తామని చెప్పింది. సమితి సభ్యదేశాల్లో మరిన్ని దేశాలు అంతర్జాతీయ శాంతి, భద్రతల నిర్వహణకు సంబంధించిన ప్రధాన బాధ్యతలను చేపట్టే సామర్థ్యం, సంసిద్ధంగా గల 21వ శతాబ్దపు అంతర్జాతీయ సమాజపు వాస్తవికతలను ప్రతిఫలించటం ద్వారా న్యాయమైన సంస్కరణలు సాధించవచ్చని జీ-4 అభిప్రాయపడింది. భద్రతామండలి శాశ్వత, తాత్కాలిక సభ్యత్వాల్లో ఆఫ్రికా ప్రాతినిధ్యానికి తన మద్దతు తెలిపింది. విస్తరించిన, సంస్కరించిన మండలిలో చిన్న, మధ్యస్థ సభ్య దేశాలకు తగినంత, నిరంతర ప్రాతినిధ్యం కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని పేర్కొంది.
సమితి పుట్టిన కాలానికన్నా భిన్నమైన ప్రపంచమిది...
‘‘సమితి పుట్టిన కాలానికన్నా మౌలికంగా భిన్నమైన ప్రపంచంలో జీవిస్తున్నాం. సభ్యదేశాల సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. శాంతి, భద్రతలకు పొంచివున్న ప్రమాదాలు మరింత సంక్లిష్టంగా, అనిశ్చితంగా మారాయి. మనం డిజిటల్ ప్రపంచంలో నివసిస్తున్నాం. ఆర్థికవ్యవస్థ మారిపోయింది. కొత్త అభివృద్ధి చోదకాలు వచ్చాయి. ఆర్థిక శక్తి విస్తృతంగా విభజితమైంది. సంపద తారతమ్యాలు పెరుగుతున్నాయి. ఆధునిక యుగం జనసంఖ్యలో పోకడలు, పట్టణీకరణ, వలసలు వంటి సవాళ్లను ఎదుర్కొంటోంది. వాతావరణ మార్పు, ఉగ్రవాదం కొత్త సమస్యలు. మన సంస్థలు, విధానాలు, తరచుగా ఆలోచనా పద్ధతులు.. మనం వెనుక వదిలివచ్చిన శతాబ్దాన్ని ప్రతిఫలిస్తున్నాయి. ప్రస్తుతం మనం నివసిస్తున్న శతాబ్దానివి కాదు. ప్రత్యేకించి మండలి విషయంలో ఇది నిజం. నిర్దిష్ట కాలావధిలో మండలి సంస్కరణలు పూర్తిచేయటం చాలా అత్యవసరమైన, ముఖ్యమైన పని’’ అని జీ-4 పేర్కొంది.
‘శాశ్వతం’ కోసం..
వేగంగా మారుతున్న పరిస్థితులకు తగ్గట్టు ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన, 125 కోట్ల జనాభాతో రెండో అతిపెద్దదేశమైన భారత్ ఐరాస భద్రతామండలిలో శాశ్వతసభ్యత్వం ఉండాలని ఎప్పటినుంచో కోరుతోంది.
ఐరాసలో సంస్కరణలు అవసరమనే చర్చాపత్రం ఈనెల 14న సర్వసభ్య సమావేశం ఆమోదం పొందడం భారత్ దీర్ఘకాలిక డిమాండ్‌కు బలం చేకూరింది.
శుక్రవారం ఐరాస సమావేశాన్ని ఉద్దేశించి మోదీ మాట్లాడుతూ... భారత్‌కు భద్రతామండలిలో చోటుదక్కాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. ఐరాస ఆవిర్భావం నాటికి, నేటికీ పరిస్థితులు ఎంతగానో మారిపోయాయని, సభ్యదేశాల సంఖ్య నాలుగింతలు పెరిగి 193కు చేరిందని... అన్ని ఖండాలకు తమ వాదనను సమర్థంగా వినిపించే అవకాశం ఉండాలని అన్నారు.
మండలిలో భారత్‌కు శాశ్వతసభ్యత్వానికి మద్దతు కూడగట్టడానికి ప్రధాని మోదీ అమెరికా పర్యటనలో విస్తృత భేటీలు జరుపుతున్నారు. ఈజిప్టు, జోర్డాన్, భూటాన్, స్వీడన్, సైప్రస్, శ్రీలంకతో సహా పలువురు దేశాధినేతలతో సమావేశమై మద్దతు కోరారు. బంగ్లాదేశ్, గయానాల అధ్యక్షులనూ కలిశారు. ఆఖరికి లక్ష జనాభా మాత్రమే ఉన్న సెయింట్ విన్సెంట్ గ్రనడైస్ నేతనూ కలిశారు. ఎందుకంటే సెయింట్ విన్సెంట్ ఐరాస సభ్యదేశం. దానికీ ఓటు హక్కుంది మరి.
మండలిలో శాశ్వతసభ్యత్వాన్ని కోరుకుంటున్న ఇతర బలమైన దేశాలైన జపాన్, జర్మనీ, బ్రెజిల్, భారత్‌లు జీ4 భేటీకి ఆతిథ్యమిచ్చి సంయుక్తంగా తమ గళాన్ని ప్రపంచానికి వినిపించాయి. నాలుగు కీలకదేశాలు శాశ్వతసభ్యత్వం తమ న్యాయమైన హక్కు అని ప్రకటించడం ద్వారా ప్రపంచదేశాలకు విస్పష్టమైన సందేశం ఇచ్చాయి. ఐరాసలో సంస్కరణ ఆవశ్యకతను నొక్కిచెప్పాయి.
ఐక్యరాజ్యసమితిలో అత్యంత శక్తిమంతమైన విభాగం భధ్రతామండలి. అంతర్జాతీయంగా శాంతి, భద్రతల పరిరక్షణను ఇదే పర్యవేక్షిస్తుంది. ప్రపంచ దేశాల్లో వేటిపైనైనా ఆంక్షలు విధించాలన్నా దీనికే ఎక్కువ అధికారం ఉంటుంది. సమితిలో ప్రస్తుతం 193 సభ్య దేశాలు ఉండగా, మండలిలో ఐదు శాశ్వత సభ్యదేశాలు, పది తాత్కాలిక సభ్యదేశాలు ఉంటాయి. శాశ్వత సభ్యదేశాలు ఐదింటికీ ‘వీటో’ అధికారం ఉంటుంది. తాత్కాలిక సభ్యదేశాలను రెండేళ్ల సభ్యత్వ కాలానికి రొటేషన్ పద్ధతిలో సర్వసభ్య సభ ఓటింగ్‌లో ఎంపిక చేస్తుంది.
మండలిలో చేసే కీలక నిర్ణయాలకు కనీసం 9 సభ్యదేశాల ఆమోదం అవసరం. అయితే.. ఏదైనా నిర్ణయానికి అవసరమైనన్ని సభ్య దేశాల ఆమోదం ఉన్నప్పటికీ.. శాశ్వత సభ్యదేశాల్లో ఏదైనా దేశం దాన్ని వ్యతిరేకించి ‘వీటో’ చేస్తే ఆ నిర్ణయం ఆమోదం పొందదు. రెండో ప్రపంచ యుద్ధంలో గెలిచిన శక్తిమంతమైన దేశాలు అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్స్, చైనాలు సమితి ఆవిర్భావం నుంచీ మండలి శాశ్వతసభ్య దేశాలుగా కొనసాగుతున్నాయి.