
అందమైన అమ్మాయిలు వయ్యారంగా నడవటం...
పారిస్ : క్యాట్‌వాక్ అంటే అందమైన అమ్మాయిలు రన్‌వేపై వయ్యారంగా నడవటం మనం చూసుంటాం. వారి ఫొటోలు, వీడియోలు వైరల్ కావటం సర్వసాధారణం. కానీ, అమ్మాయిల ఫ్యాషన్ షోలో ఓ అబ్బాయి చేసిన క్యాట్‌వాక్ నెటిజన్లను తెగ నవ్విస్తోంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఓ వీడియో సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. నాలుగు రోజుల క్రితం పారిస్‌లో మేసన్ మార్జిల్లా స్ప్రింగ్ 2020 ఫ్యాషన్ షో జరిగింది. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మోడళ్లు తమ క్యాట్‌వాక్‌తో అందరినీ ఆకట్టుకున్నారు. అయితే ఈ షో ముగింపు గుర్తుండిపోయేలా ఉండాలని నిర్వాహకులు భావించారు. ఇందుకోసం లియోన్ డేమ్స్ అనే జర్మన్ మోడల్‌ను రంగంలోకి దించారు.
బుధవారం షో ముగియనుందనగా చివరిగా లియోన్ తన విచిత్ర వేషధారణతో రన్‌వేపైకి వచ్చాడు. అతని నడక, వేషధారణ చూసిన అక్కడివారు నవ్వు ఆపుకోలేకపోయారు. లియోన్ క్యాట్‌వాక్‌ను వీడియో తీసి తమ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేసుకున్నారు.