‘పెళ్లి స్త్రీ, పురుషుడికి మధ్యే జరగాలి.. కానీ’
బెర్లిన్: జర్మనీలో స్వలింగ సంపర్కులు విజయం సాధించారు. వారు పెళ్లిళ్లు చేసుకునేందుకు జర్మనీ పార్లమెంటు ఓకే చెప్పింది. గత కొద్ది రోజులుగా కొనసాగుతున్న ఉత్కంఠకు శుక్రవారం తెరపడింది. స్వలింగ సంపర్కుల వివాహం అంశంపై ప్రవేశపెట్టిన బిల్లుకు జర్మనీ పార్లమెంటు ఆమోదం తెలిపింది. జర్మనీ ఛాన్సలర్ ఎంజెలా మెర్కెల్‌తో సహా ఆమె పార్టీలోని పలువురు ఈ బిల్లును వ్యతిరేకించినా అది చట్టంగా రూపుదాల్చడం గమనార్హం. ఈ సందర్భంగా ఎంజెలా మెర్కెల్ మాట్లాడుతూ ‘నేను గేల పెళ్లిళ్లకు వ్యతిరేకంగా నా ఓటు హక్కును వినియోగించుకున్నాను. ఇది నా వ్యక్తిగతం. నా దృష్టిలో పెళ్లి అంటే ఒక పురుషుడు, ఒక స్త్రీ మధ్యే జరగాలి. పార్లమెంటు సమాజంలో మరింత మార్పును ఆశించిందేమో’ అని వ్యాఖ్యానించారు.
ఈ సందర్భంగా జర్మనీ చట్టంలో కొత్తగా మార్పు చేసిన ప్రకారం ‘ఒక స్త్రీ పురుషుడు, లేదా స్వలింగ వ్యక్తుల జీవితాల్లోకి వివాహం అడుగుపెట్టింది’ అని కొత్త చట్టంలో పేర్కొన్నారు. ఈ బిల్లుకు లెప్టిస్ట్ పార్టీలు బాగా మద్దతిచ్చాయి. తాజాగా చేసిన చట్టం ద్వారా స్వలింగ సంపర్కులకు కేవలం వివాహ అవకాశం మాత్రమే కాకుండా పిల్లలను కూడా దత్తత తీసుకునే అవకాశం ఇచ్చింది. ఇదివరకే జర్మనీ ఎగువ సభ ఈ బిల్లును ఆమోదించగా తాజాగా దిగువ సభలో ఈ బిల్లు 393/226 ఓట్లతో పాసయి చట్టంగా రూపుదాల్చనుంది. ఈ ఏడాది చివరినాటికి ఈ చట్టం పూర్తి స్థాయిలో అందుబాటులోకి రానుంది.