జెనీవా: రోజురోజుకు గుట్టలు గుట్టలుగా పేరుకు పోతున్న ప్లాస్టిక్ వ్యర్థాలతో యావత్ భారతదేశం కాలుష్య కోరల్లో చిక్కుకుంటుంటే యూరప్, పశ్చిమ దేశాలు అక్కడ పేరుకుపోయిన చెత్తను పునర్వినియోగంలోకి తెస్తూ క్లీన్ కంట్రీస్‌గా మారేందుకు శ్రమిస్తున్నాయి. పర్యావరణ హితం కోసం పనిచేసే కన్సల్టెన్సీ సంస్థ యూనోమియా చెత్త నిర్వహణపై ఒక నివేదిక తయారు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా చెత్తను రీసైకిల్ చేస్తున్న దేశాల జాబితాను యూనోమియా ఇటీవల విడుదల చేసింది. ఈ రిపోర్టు ప్రకారం.. చెత్త నిర్వహణ, పునర్వినియోగంలో జర్మనీ మొదటి స్థానంలో నిలవగా... ఆస్ట్రియా, దక్షిణ కొరియా, వేల్స్ దేశాలు తరువాతి స్థానాల్లో ఉన్నాయి.
52 నుంచి 56 శాతం చెత్తను రీసైకిల్ చేస్తూ దేశాలు ఆదర్శంగా నిలుస్తున్నాయి. తమ దేశంలోని సగం చెత్తను రీసైకిల్ చేస్తూ స్విట్జర్‌లాండ్ అయిదో స్థానంలో ఉంది. స్థానిక ప్రభుత్వాలను, దేశ ప్రజలను చైతన్యం చేస్తూ ఆయా దేశాలు స్వచ్ఛత సాధిస్తున్నాయని రిపోర్టు వెల్లడించింది. ఒకే తరహా చెత్త సేకరణ విధానాలు అవలంభిస్తూ, ఈ దేశాలు చెత్త నిర్వహణకు తగినన్ని నిధులు కేటాయిస్తున్నాయని స్పష్టం చేసింది.
కాగా, జాబితాలో నాలుగో స్థానంలో నిలిచిన వేల్స్ దేశం మిగతా వాటి కంటే ఉన్నతమైన లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగుతోందనీ, కొన్ని నెలల్లోనే అది ప్రథమ స్థానానికి చేరుకోవచ్చని రిపోర్టు వెల్లడించింది. 2050 వరకు జీరో వేస్టేజి దేశంగా అవతరించడానికి వేల్స్ ప్రణాళికలు రచించుకుంది. మరోవైపు, ఇప్పటివరకు ప్రపంచంలోని చాలా దేశాల్లోని ఇండస్ట్రియల్ చెత్తను దిగుమతి చేసుకుని రీసైకిల్ చేసే చైనా తన పంథా మార్చుకుంది. 24 రకాల చెత్తను రీసైకిల్ చేయబోమని ప్రకటించింది. దాంతో చెత్త నిర్వహణపై చైనాపై ఆధారపడ్డ ఆయా దేశాలపై మరింత పనిభారం పడింది. కాగా, ఐరోపా దేశాలు 30 శాతం ప్లాస్టిక్ వ్యర్థాలను రీసైకిల్ చేస్తుండగా.. అమెరికా కేవలం 9 శాతమే రీసైకిల్ చేస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment