
వాషింగ్టన్ : ఓ మేక ఏడాది కాలం పాటూ ఓ పట్టణానికి గౌరవ మేయర్‌గా ఎన్నికైంది. ప్రభుత్వ సహకారంతో జరిగిన ఎన్నికల్లో శునకాలు, పిల్లులు సహా 15 ఇతర జంతువులు పాల్గొనగా, చివరగా మేక గౌరవ మేయర్‌గా గెలుపొందింది. మీరు విన్నది నిజమేనండి. వెర్‌మోంట్‌లోని ఫెయిర్ హావెన్ అనే పట్టణంలో ప్రత్యేకంగా ఎన్నికలు జరిపారు. ఈ ఎన్నికల్లో మూడేళ్ల నుబియన్ జాతికి చెందిన లింకన్ అనే మేక 3000 మంది జనాభా కలిగిన ఫెయిర్ హావెన్ పట్టణ గౌరవ మేయర్‌గా ఎంపికైంది. ఫెయిర్‌హావెన్ నగర పాలనా వ్యవహారాలు చూసే మేనేజర్ జోసెఫ్ గుంటెర్ నిధుల సమీకరణ కోసం ప్రత్యేకంగా ఈ ఎన్నికలు నిర్వహించారు.
నగరంలోని ఎలిమెంటరీ పాఠశాలపక్కనున్న మైదానం బాగుచేయడానికి నిధులు సేకరించేందుకు ఈ ఎన్నికలు నిర్వహించామని గుంటెర్ తెలిపారు. నిధుల సమీకరణ కోసం ఓ పట్టణంలో ఇదే తరహాలో ఎన్నికలు జరిగాయని తెలుసుకున్న తర్వాత ఈ ఆలోచన తట్టిందన్నారు. ప్రభుత్వ ప్రమేయంతో ఇలాంటి ఎన్నికలు నిర్వహించడం సరదాగా ఉందని తెలిపారు. మేయర్‌గా లింకన్, సమ్మీ అనే శునకంపై 13 ఓట్ల తేడాతో విజయం సాధించి, హానరరీ మేయర్‌గా ఎంపికైంది. మేక లింకన్ యజమాని క్రిస్టోఫర్ గణిత ఉపాధ్యులుగా అదే పట్టణంలో విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే మైదానం నిర్మాణానికి మొత్తంనిధులు సమకూరకపోయినా.. మేక లింకన్‌తోపాటూ ఫెయిర్ హావెన్ పట్టణం పేరు మాత్రం ఈ ఎన్నికలతో ప్రపంచ వ్యాప్తంగా ఫేమస్ అయ్యాయి.